మేడారం జాతర ముగిసింది. దాదాపు 15 రోజులుగా మేడారం జన సంద్రమైంది. భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది. రోజూ లక్షల్లో భక్తులు మేడారం జాతరకు వచ్చారు. మేడారం.. రెండేళ్లకోసారి జరిగే గిరిజన కుంభమేళాగా చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి లక్షల మంది ఈ జాతరకు వచ్చారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం గురించి చెప్పుకుంటారు.

 

మరి తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద గిరిజన జాతర జరిగితే.. కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తే.. ఆంధ్రా మీడియా మాత్రం ఈ విషయానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు, వాదనలు వినిపిస్తున్నాయి. మేడారం జాతరపై ఆంధ్రా మీడియా వివక్ష చూపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడారం సమ్మక్క-సారలమ్మలు కేవలం తెలంగాణ దేవతలుగా ఆంధ్రా మీడియా ఫీలైనట్టు కనిపించింది.

 

తప్పదు కాబట్టి తెలంగాణ ఎడిషన్లలో ఆ వార్తలు ప్రచురించింది. ఏపీ ఎడిషన్లకొచ్చేసరికి ఏమాత్రం కవరేజ్ ఇవ్వలేదనే విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కనీసం ఇవ్వాల్సినంత కవరేజ్ కూడా ఆంధ్రా ఎడిషన్లలో ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. రెండేళ్లకోసారి జరిగే అతి పెద్ద జాతర, కేవలం రెండు మూడు రోజుల్లోనే కోటిన్నర మంది భక్తజనం ఒక గద్దెను దర్శించుకునే ప్రత్యేకత ఉన్న జాతర. తెలుగు పత్రికలతో పోలిస్తే.. ఇంగ్లీషు పత్రికలే కాస్త నయం అనిపించాయి.

 

తెలంగాణ ప్రభుత్వ యాడ్స్ దండిగా దండుకునే పత్రికలు కూడా మేడారం జాతరకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇది కేవలం తెలంగాణ పై ఆంధ్రా వివక్ష తప్ప వేరొకటి కాదని చెబుతున్నారు. అయితే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎడిషన్లు ఉన్నందువల్ల మేడారం జాతరను తెలంగాణ ఎడిషన్లకు మాత్రమే పరిమితం చేసి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా దైవాల విషయంలోనూ ఈ వివక్ష సమర్థించదగింది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: