ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. సున్నా వడ్డీకే మహిళలకు రుణాలను ఇస్తామని అతి త్వరలో ఈ పథకానికి శ్రీకారం చుడతామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకం అమలులో ఉండేదని ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. 
 
మహిళలకు వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కొరకు చట్టాన్ని తీసుకొనివచ్చామని చెప్పారు. రాష్ట్రంలో మహిళల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చామని మరికొన్ని పథకాలను తీసుకొస్తామని మహిళలు పురుషులతో పోలిస్తే అన్ని రంగాలలో ఎదగాలని సీఎం జగన్ అన్నారు. 
 
పిల్లలకు తాను మేనమామలా ఉంటానని అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 42 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఉగాది పండుగ నాటికి ఇళ్లస్థలాలను ఇవ్వబోతున్నామని అన్నారు. ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహిళల భద్రత కోసమే దిశ చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. 
 
నిన్న రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దిశ యాప్ ను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. 18 దిశ పోలీస్ స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కానుండగా ఒక్కో స్టేషన్ లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉండనున్నారు. ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రజలలో అవగాహన కల్పించటం కొరకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.                      

మరింత సమాచారం తెలుసుకోండి: