గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 20 లక్షల రేషన్ కార్డులు రద్దు అయినట్టు కొన్ని ప్రముఖ దినపత్రికలలో కథనాలు వచ్చాయి. ఏకంగా 20 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసినట్టు వార్తలు రావడంతో ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమైంది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వస్తూ ఉండటంతో వైసీపీ పార్టీ తరపున మంత్రి కొడాలి నాని స్పందించి స్పష్టత ఇచ్చారు. 
 
మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు. గ్రామ, వార్డ్ వాలంటీర్లు సర్వేలు చేసి అక్రమంగా రేషన్ తీసుకుంటున్న వారిని గుర్తించారని కొడాలి నాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటీ 47 లక్షల 23 వేల 567 మందికి రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. 
 
రేషన్ కార్డులు ఉన్నవారిలో దాదాపు 10 లక్షల మంది రేషన్ షాపుల నుండి బియ్యాన్ని తీసుకోవడం లేదని గుర్తించామని కొడాలినాని చెప్పారు. ప్రభుత్వం దాదాపు లక్ష మందిని అనర్హులుగా గుర్తించిందని కొడాలి నాని అన్నారు. అతి త్వరలో ప్యాకింగ్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వనున్నామని చెప్పారు. మార్చి నెల నుండి బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు కొడాలి నాని తెలిపారు. 
 
ప్రజలకు బియ్యంతో పాటు గోధుమలు, పామాయిల్, చిరుధాన్యాలు, పంచదార, నిత్యావసర సరుకులు కూడా ఇస్తామని కొడాలి నాని చెప్పారు. కొత్త బియాన్ని ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకొనిరానుందని అన్నారు. బియ్యం కార్డులు కేవలం రేషన్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయని మిగిలిన పథకాలకు సంబంధించిన కార్డులను కూడా త్వరలోనే జారీ చేయనున్నామని చెప్పారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: