దాదాపు 4.5 లక్షల మందికి చెందిన బ్యాంక్‌ వివరాలు డార్క్‌ మార్కెట్‌లో అమ్మకానికి వచ్చినట్టుగా సింగపూర్‌ పోలీసులు గుర్తించారు. ఇందులో లావాదేవీల వివరాలతో పాటు బ్యాంక్‌ అకౌంట్‌, డెబిట్ కార్డ్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని సింగపూర్‌కు చెందిన ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ గ్రూప్‌ ఐబీ బయటపెట్టింది. ఆన్‌లైన్‌లో అక్రమాలకు పాల్పడే జోకర్స్‌ స్టాష్‌ అనే సంస్థ బుధవారం పెద్ద ఎత్తున క్రెడిట్, డెబిట్‌ కార్డుల వివరాలను అమ్మకానికి పెట్టిందని ఇన్వెస్టిగేషన్‌ సంస్థ వెల్లడించింది.

 

ఫిషింగ్ రాకెట్ల ద్వారా జోకర్‌ స్టాష్‌ సంస్థ ఈ వివరాలు సేకరించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. లీకైన సమాచారంలో క్రెడిట్ కార్డు నెంబర్లతో పాటు వాటి వ్యాలిడిటీ, సీవీవీ నెంబర్లు కూడా ఉన్నాయని అనుమానిస్తున్నారు. అంతేకాదు కార్డు హోల్డర్‌ పేరు, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు కూడా లీకై ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాలు ఈ నెల 5వ తారీఖున వెబ్‌సైట్లో అమ్మాకానికి పెట్టినట్టుగా తెలుస్తోంది.

 

ఒక్కో కార్డుకు సంబంధించిన వివరాలు దాదాపు 630 రూపాయలకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడేవారు ఈ వివరాలను కొంటున్నారని గుర్తించారు. వీటి ద్వారా పెద్ద ఎత్తున మోసాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వివరాలు అమ్ముడై ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వివరాలను భారత్‌కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్సాన్స్‌ టీంకు తెలియజేసినట్టుగా సింగపూర్‌ సంస్థ వెల్లడించింది. ఈ వివరాలను ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఈ వివరాల్లో ఎంత నిజం ఉందో అధికారిక ప్రకటన వస్తేగాని తెలియదు.

 

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డిబిట్, క్రెడిట్‌ కార్డులు ఎలా వాడాలన్న వివరాలుపై సరిగ్గా అవగాహన లేకపోవటం వల్లే ఇలాంటి డాటా చోరీలు జరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు.  అందుకే సామాన్యులకు ఈ విషయంలో అవగాహన కల్పిస్తే ఇలాంటి చోరీలకు అడ్డుకట్ట వేయవచ్చని చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: