ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ నిన్న సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఉత్తర్వుల్లో దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు ముప్పుగా ఉన్న సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం వలనే సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
విజయవాడ నగరాన్ని విడిచి వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని సస్పెన్షన్ కాలానికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. తాజాగా తనపై వస్తున్న వార్తల గురించి, సస్పెన్షన్ గురించి వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు వెంకటేశ్వరరావు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ప్రకటనలో మీడియాలో తన గురించి వస్తున్న కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పడం తన ముఖ్య ఉద్దేశమని అన్నారు. 
 
ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడం వలన తనకు మానసికంగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అందువలన ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. చట్టపరంగా ప్రభుత్వం తీసుకున్న చర్యను ఎదుర్కోవటం కోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నానని వెంకటేశ్వరరావు చెప్పారు. తన తదుపరి కార్యాచరణ ఏమిటనే విషయం త్వరలోనే తెలుస్తుందని అన్నారు. 
 
మరోవైపు పోలీసు అధికారులు, రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక లేఖ రాసినంత మాత్రాన చేసిన పాపాలు పోవని చేసిన తప్పుల కారణంగానే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. తన కొడుకు నడుపుతున్న ఒక సంస్థ కోసం నిబంధనలను ఉల్లంఘించి ఇజ్రాయెల్ కంపెనీతో కాంట్రాక్టు ఇప్పించుకోవడం వలనే సస్పెండ్ చేశారని పోలీస్, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మీడియాలో వస్తున్న కథనాలలో నిజం లేదని వెంకటేశ్వరరావు చెబుతున్నా ఆ కథనాలు నిజమే అని తెలియటానికి ఎంతో కాలం పట్టదని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. మరి జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: