ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి న‌మ్మినబంటు అనే పేరున్న  ఎంపీ విజ‌య సాయిరెడ్డి  పార్టీ త‌ర‌ఫున బ‌లంగా గ‌లం వినిపిస్తార‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుపై వివిధ సంద‌ర్భాల్లో విజ‌య‌సాయిరెడ్డి ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా కియా మోటార్స్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుందనే ప్ర‌చారంపై సైతం ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఈ రాతలు రాయించింది టీడీపీ అధినేత‌ చంద్రబాబేనని ఆరోపించారు.  

 


చంద్ర‌బాబు తీరుపై ట్విట‌ర్లో విజ‌య‌సాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసే చంద్ర‌బాబు రాయిటర్స్‌ ద్వారా   తప్పుడు వార్తలు రాయించారని విమ‌ర్శించారు. 'ఆఖరికి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్‌ను కూడా మేనేజ్‌ చేసి కియా కార్ల ఫ్యాక్టరీ తరలిపోతుందంటూ వార్త రాయించి పుకార్లు లేవదీశాడు. సీఎంగా ఉండగా ప్రజాధనంతో ఆ సంస్థకు ప్రయోజనాలు కల్పించి ఇప్పుడు ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నాడు. అన్ని వ్యవస్థలతో పాటూ మీడియాను భ్రష్టు పట్టించాడని' విజ‌య సాయిరెడ్డి మండిప‌డ్డారు. 

 

ఇదిలాఉండ‌గా,   ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటర్స్‌ ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలకు ఆ కంపెనీ ఎండీ తెరదించారు. అనంతపురం జిల్లాలోనే తమ ప్లాంట్‌ను కొనసాగిస్తామని, అక్కడి నుంచే ప్రపంచస్థాయి వాహనాలను తయారుచేస్తామని స్పష్టం చేశారు. కియా ప్లాం ట్‌ను అనంతపురం జిల్లా నుంచి తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు ‘రాయిటర్స్‌' వార్తా సంస్థ ప్రచురించిన కథనం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ మేరకు కియా ఎండీ పంపిన సందేశాన్ని ఆ సంస్థ ప్రతినిధి శుక్రవారం చదివి వినిపించారు. ఏపీ నుంచి తమ ప్లాంట్‌ను ఎక్కడికీ తరలించాలనుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇలా మ‌రోమారు చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి త‌న‌దైన శైలిలో కామెంట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: