సుదీర్ఘ‌కాలం త‌ర్వాత హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ పి.చిదంబరం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏఐసీసీ నేతృత్వంలో హైద‌రాబాద్‌లో కేంద్ర బడ్జెట్‌, దేశ ఆర్థిక వ్యవస్థపై సెమినార్‌ నిర్వహణ జరిగింది. ఈ సెమినార్‌కు మాజీ మంత్రి పి.చిదంబరం హాజరయ్యారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి 8.5 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిందని  కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం విశ్లేషించారు.

 


కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో చెప్పినవన్నీ అంకెల గారడేనని చిదంబరం విమర్శించారు. ఆర్థిక పరిస్థితి తిరోగమన దిశలో ఉందని చెప్పారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిందని చిదంబ‌రం అన్నారు. జీఎస్టీ మంచిదే అయినప్పటికే సరిగ్గా అమలు చేయలేకపోయారన్నారు. ఆహార, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో లక్ష కోట్ల కోత విధించారన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం విస్మరించారన్నారు. నైపుణ్యాభివృద్ధిని కూడా గాలికి వ‌దిలేశారని ఆయ‌న ఆరోపించారు. అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడ్డాయని... ఆటోమొబైల్‌ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లాయన్నారు. పెట్టుబడులు లేక దేశంలో ఉత్పత్తులు నిలిచిపోయాయన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి వ్యవస్థ, విభాగం క్షీణదశలో ఉందని అన్నారు. మోడీ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ బాగా దిగజారిపోయిందని చిదంబరం ఆరోపించారు. దేశానికి భారీ పెట్టుబడులు రావడం లేదన్నారు. గ్రామీణ భారతానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌కు గత బడ్జెట్‌లో రూ. 6 500 కోట్ల కేటాయింపులు చేసి రూ.3300 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని తెలిపారు. వాస్తవానికి బడ్జెట్‌ ప్రతిఫలాలు పొందాల్సింది పేదలని, కానీ వారికి సానుకూలంగా ఒక్క ప్రతిపాదన కూడా లేదని విమర్శించారు. 

 


పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, మొత్తం ఎనిమిదిన్నర లక్షల కోట్లకుగాను మోడీ సర్కారు ఆరున్నర లక్షల కోట్లే పంచిందని చిదంబ‌రం ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాలో ఈసారి ఐదు వేల కోట్లు నష్టపోయిందని.. అయినా కేసీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు. బడ్జెట్​ వాటా తగ్గినా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్​ ఒకసారి కేంద్రానికి అనుకూలంగా, మరోసారి వ్యతిరేకంగా మాట్లాడుతారని విమర్శించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: