తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైందా? ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరి మద్దతు తీసుకోవాలి అనేదానిపై ఓ క్లారిటీకి వచ్చారా? 2021 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తలైవా పాదయాత్ర చేపట్టనున్నారా?  ప్రస్తుతం జరుగుతున్న చర్చలు చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తోంది.  ఇప్పుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్.   

 

ఒక అడుగు ముందుకు- నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటకల్ జర్నీ. 2017లోనే రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన తలైవా, రెండేళ్లు గడిచినా ఇంకా పార్టీని ఏర్పాటు చేయలేదు. ఆథ్యాత్మిక రాజకీయాలు అంటూ కొత్త స్లోగన్‌తో ప్రజల ముందుకు వచ్చిన రజనీ, పార్టీ ఏర్పాటు, ప్రకటనపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామంటూ అభిమానులకు మీఠా కబర్ చెప్పిన కబాలీ, ఇప్పుడు పొలిటికల్‌గా స్పీడ్ పెంచారు.

 

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఆలోపే పార్టీని ప్రారంభించడం, పార్టీ గుర్తు-సిద్ధాంతాలు-ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఏప్రిల్ లో రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రజనీ మక్కల్ మండ్రంకు చెందిన అగ్రనేతలు నిర్ధారిస్తున్నారు. ఏప్రిల్ 14 తర్వాత వెంటనే రజనీకాంత్ పార్టీ ఆవిర్భావం ఉంటుందని చెబుతున్నారు.  దీనికి సంబంధించిన ఏర్పాట్లలో వారు తలమునకలైనట్లు తెలుస్తోంది.


       
వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే తదితర చిన్నాచితక పార్టీలతో రజనీకాంత్ సన్నిహితులు ఇప్పటి నుంచే తెరచాటు సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  అటు బీజేపీతో పొత్తు విషయంలో రజనీకాంతే నిర్ణయం తీసుకుంటారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

 

ఇప్పటికే త‌న పార్టీలోకి అభిమానులను ఆహ్వానిస్తూ "రజిని మండ్రం.ఓఆర్‌జీ" పేరుతో తలైవా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కేవలం రెండు రోజుల్లో లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు.   ఆయ‌న వెబ్‌సైట్‌కు పెట్టిన పేరే ఆయ‌న పార్టీకి కూడా పెట్ట‌వ‌చ్చ‌న్న ఊహాగానాలు న‌డుస్తున్నాయి. మరి ర‌జ‌నీ పార్టీ పేరు, సింబ‌ల్‌పై క్లారిటీ రావాలంటే  మరికొన్ని రోజులు ఆగాల్సిందే.    

 
 
తుగ్లక్ మ్యాగజైన్ వార్షికోత్సవాల్లో పెరియార్‌పై రజనీ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని,  పార్టీ స్థాపనకు ముందు, తన స్టాండ్ ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియజేసేందుకే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు. అలాగే రాజకీయనేతగా  ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు రజనీ కాంత్ ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: