మాజీ సీఎం, దేశాన్ని గెలిచిన రాజ‌కీయ నేత‌గా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకునే టీడీపీ అధినేత‌ చంద్ర బాబు.. కేంద్రానికి భ‌య‌ప‌డుతున్నారా?  త‌న‌పై కేసులు పెడ‌తారేమో.. ఇరికిస్తారేమో.. జైల్లోకి నెడ‌తారేమో.. అని న‌క్కిన‌క్కి దాక్కుంటున్నారా? అంటే.. తాజాగా చంద్ర‌బాబు అనుకూల మీడియాలోనే వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఔన‌నే అనుకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి బాబును ఆకాశానికి ఎత్తేయ‌డమే త‌ప్ప ఒక్క అడుగు కూడా నేల‌పై న‌డిపించేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఆ మీడియాలో వారం వారం వెలువ‌రించే ఓ క‌థ‌నంలో అచ్చం.. చంద్ర‌బాబును విసిరి నేల‌కేసికొట్టిన‌ట్టు రాసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

 

`మీదొక ప్ర‌భుత్వం-మాదొక ప్ర‌భుత్వం.. మీరు మాపై నియంతృత్వం చేస్తారా?. మీ అంతు తేలుస్తా. మీరు గ‌ద్దె దిగేవ‌ర‌కు మిమ్మ‌ల్ని ఒదిలి పెట్టేది లేదు.``అంటూ గ‌త మోడీ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ లు ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తుండే ఉంటాయి. అలాంటి నాయ‌కుడు, ఇప్పుడు మోడీని చూసినా, బీజేపీ పేరు విన్నా .. గ‌జ‌గ‌జ‌లాడుతున్నాడ‌నేది ఈ మీడియా క‌థ‌నం సారాంశం. మ‌రి ఎందుకు ఆయ‌న అంత‌గా ఒణికి పోతు న్నార‌నేది కీల‌క స‌బ్జెక్ట్‌. 

 

ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి అనేక రూపాల్లో నిధులు, అనుమ‌తులు కూడా అందాల్సిన అవ‌స‌రం ఉంది. పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో వెనుక బ‌డిన ప్రాంతాల‌కూ నిధులు అందాల్సి ఉంది. అన్నింటిక‌న్నా ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కూడా కేంద్ర‌మే క‌నిక‌రించాలి. కానీ, ఇప్పుడు ఏపీలో ఉన్న ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఉదాసీనంగా ఉంద‌ని, అడిగితే ఎక్క‌డ సీఎం జ‌గ‌న్‌ను జైలుకు పంపిస్తారో అని వైసీపీ ఎంపీలుభ‌య‌ప‌డుతున్నార‌ని తాజాగా వెలువ‌రించిన బాబు అనుకూల మీడియా క‌థ‌నం రాసింది. 

 

ప‌నిలో ప‌నిగా.. బాబు విష‌యాన్ని కూడా ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబు కూడా ఈ విష‌యంలో మౌనంగానే ఉన్నార‌ని, ఆయ‌న కూడా కేంద్రానికి భ‌య‌ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చింది. తాను ఎక్క‌డ హోదా అడిగినా.. వెంట‌నే కేసులు పెట్టేందుకు కేంద్రం రెడీ గా ఉంద‌ని రాసుకొచ్చింది. ఈ ప‌రిణామాలు చూశాక‌.. గతంలో జ‌రిగిన ఓటుకు నోటు కేసు అంద‌రి మ‌న‌సుల్లోనూ మెద‌ల‌డం ప్రారంభ‌మైంది. ఏదేమైనా.. ప్ర‌పంచాన్ని గెలిచాన‌ని చెప్పుకొన్న అలెగ్జాండ‌ర్ చివ‌రి రోజులు అంద‌రి ముందు సినిమాలా క‌నిపించాయ‌ట‌!!

మరింత సమాచారం తెలుసుకోండి: