తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రానురాను వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షనిష్ట్ ధోరణి పరాకాష్టకు చేరుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, కూలీలు, అన్నివర్గాల ప్రజలను కష్టాలకు గురి చేస్తోందని చెప్పారు. సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీల నేతలపై, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. 
 
ఇప్పుడు ఏకంగా వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టు పంజాను ప్రభుత్వ ఉద్యోగులపైనే విసిరిందని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనతో చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతా నుండి వైసీపీ ప్రభుత్వంపై, ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 
 
వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల కన్నా ఒక్కరోజు వెయిటింగ్ లో ఉన్నా ఆసాధారణ సెలవుగా పరిగణిస్తామని చెప్పటం, 3 నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించం అని ఉత్తర్వులను జారీ చేయటం వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వందలాది మంది అధికారులను, వందలాది మంది సిబ్బందిని పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి దుర్మార్గ చర్యలను ఖండించాలని అన్నారు. 8 నెలలకు పైగా వైసీపీ ప్రభుత్వం ఇంతమందిని ఎందుకు వెయిటింగ్ లో పెట్టిందని చంద్రబాబు ప్రశ్నించారు. మూడు నెలల కాలపరిమితి తరువాత ప్రభుత్వం జస్టిఫికేషన్ కు ఎందుకు పంపలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: