అకాలవర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన ధాన్యం మార్కెట్‌ యార్డుల్లో తడిసిముద్దయింది. మరికొన్నిచోట్ల నీటిపాలైంది. చాలా ప్రాంతాల్లో కోతకొచ్చిన పంట దెబ్బతింది. మిరపతో పాటు కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి.

 

మేఘాలు లేవు.. ఉరుములు మెరుపుల్లేవు.. కనీసం గాలి కూడా వీయలేదు.  అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వానలు కురిశాయి. మూడు గంటల పాటు మిర్యాలగూడలో భారీ వర్షం పడింది. చిరు జల్లులతో మొదలైన వాన.. భారీ వర్షంగా మారడంతో రోడ్లు అన్ని జలమయమయ్యాయి. అకాల వర్షం దాటికి పట్టణంలో అడుగు నుంచి రెండు అడుగుల మేర నీరు నిలిచి పోవడంతో.. నానా అవస్థలు పడ్డారు ప్రజలు. మండలంలోని పలు ప్రాంతాలు నీటిమయమయ్యాయి.

 

మంచిర్యాలలో అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. రాత్రంతా కురిసిన భారీ వర్షంతో.. ఆరబెట్టిన ధాన్యాం తడిసిపోయింది. పత్తి పొలంలో నీరు చేరి కోయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో వందల ఎకరాల్లో పత్తి వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి లబోదిబోమంటున్నారు. ఏపుగా పూత పూసిన మామిడితోట వర్షానికి రాలిపోయి రైతుల ఆశలను ఆవిరి చేసింది.

 

ఖమ్మం జిల్లా కుసుమంచిలో అకాల వర్షంతో కళ్ళల్లో ఉంచిన మిర్చి పంట తడిచిపోయింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో.. కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చి అమ్మకానికి వచ్చిన తరుణంలో తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు.

 

సూర్యపేట జిల్లాలో అకాల వర్షం ఓ మోస్తారుగా  పడినా.. అన్నదాతలకు కష్టాలు మాత్రం భారీగానే తెచ్చింది. మఠంపల్లి, మెల్లచెర్వులో మిరప పంట పూర్తిగా తడిసిపోయింది. అటు ఏపీలోనూ అకాల వర్షం రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, విజయవాడలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మొత్తం మీద.. అకాల వర్షాల కారణంగా పలు చోట్ల రైతులు నష్టపోవాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: