`మహానటి` సినిమాతో వ‌య‌సులతో సంబంధం లేకుండా అభిమానుల‌ను సొంతం చేసుకున్న‌ ప్రముఖ సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా మ‌రోమారు ఆస‌క్తిక‌ర ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సూరారంలోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో కీర్తి సురేష్ మొక్కలు నాటారు. 

 

మొక్క‌లు నాటిన అనంత‌రం కీర్తి సురేష్ మీడియాతో  మాట్లాడుతూ...గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తాను మొక్కలు నాటినట్లు తెలిపారు. త‌నలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నానని కీర్తి సురేష్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమమ‌ని తెలిపారు. కాలుష్యం పెరుగుతున్న ఈ సమయంలో ఈ కార్యక్రమంలో  అందరూ పాల్గొన్నీ చెట్లను పెంచాలి అని కీర్తి సురేష్ కోరారు.

 

మ‌రోవైపు, యువ దర్శకుడు వెంకీ అట్లూరి సైతం మొక్క‌లు నాటారు. సూరారంలోని టెక్ మహేంద్ర క్యాంపస్ లో మొక్కలు నాటిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఆ సంస్థ వారికి అభినందనలు తెలియజేశారు. వాతావరణ కాలుష్యాం నియంత్రణ కావాలి అంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే  ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించారు. నగరి ఎమ్మెల్యే రోజా విసిరిన హరిత సవాల్‌ను స్వీకరించిన ఆమె… తన నియోజకవర్గం పరిధిలోని చినమేరంగిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలే మానవాళికి జీవనాధారమన్నారు. ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మారుద్దామని పిలుపునిచ్చారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంద‌ని, పర్యావరణ హితం కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతున్నారని వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: