తిరుపతి గరుడ వారధి పనులు ఊపందుకున్నాయి. గరుడ వారధి ఫినిషింగ్ లో స్వామివారి నామాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 6 కిలోమీటర్ల మేర సాగుతున్న ఈ ఫ్లైఓవర్ తో తిరుపతి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 

 

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో రూ.684 కోట్లతో  నిర్మించే గరుడవారధి ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. శ్రీవారి నామాలతో నిర్మించిన పిల్లర్ లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధ్మాత్మిక భావనతో భక్తులను, నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి.



శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులెవరైనా తిరుపతి మీదుగానే తిరుమల వెళ్లాలి. తిరుపతి వరకు రైళ్లు, బస్సులు, విమానాలు... ఎలా వచ్చినా తిరుపతి రోడ్లపై ట్రాఫిక్ ని మాత్రం అనుసరించాల్సిందే. తిరుపతి రోడ్లపై నిత్యం 40 వేల వాహనాలు వచ్చి పోతుంటాయి. వివిధ మార్గాల ద్వారా లక్షమందికి పైగా భక్తులు తిరుమల వస్తుంటారు. 

 

వేల వాహనాలు, భారీ సంఖ్యలో భక్తులు ప్రతిరోజూ తిరుపతి రోడ్లపై నానా కష్టాలు పడుతున్నారు. వాహనాల రద్దీ పెరగడం, రోడ్లన్నీ ఆక్రమణలతో నిండిపోవడంతో నగర ప్రయాణం ఇబ్బందిగా మారింది. వచ్చిపోయే యాత్రికుల పరిస్థితి ఇలాఉంటే, ఇక స్థానికులు రోజూ పడే తిప్పలు మాటల్లో చెప్పలేం.

 

తిరుపతి ట్రాఫిక్ కష్టాలకు పరిస్కారంగా గరుడ వారధి తెరపైకి వచ్చింది. తిరుచానూరు సమీపంలోని శిల్పారామం నుంచి కపిలతీర్థం వద్ద ఉన్న నంది కూడలి వరకు దీన్ని నిర్మిస్తున్నారు. టీటీడీ, నగరపాలక సంస్ధ నిధులతో 6 కిమీ దూరం నిర్మిస్తున్న స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ కి గరుడవారధి అని పేరు పెట్టారు. 

 

సాధారణంగా పిల్లర్ల డిజైన్ లో పెద్ద విశేషం ఉండదు. కానీ, గరుడవారధికి స్వామీ వారి నామాలు వచ్చేలా చేసిన  పిల్లర్ల ఫినిషింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. సోషల్‌ మీడియాలో పిల్లర్ల ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇక నగరవాసులు ఈ పిల్లర్ల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడుతున్నారు. 

 

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆప్కాన్ గత ఏడాది మార్చిలో పనులు మొదలుపెట్టింది. రెండేళ్లలోగా పూర్తి చేయాలనేది టార్గెట్. 300 మంది కార్మికులు, తిరుచానూరు నుంచి కపిలతీర్థం వరకు భారీ యంత్రాలతో, నిత్యం పనిచేస్తున్నారు. రూ.684 కోట్ల బడ్జెట్ తో 6 కి.మీ పొడవుతో నిర్మిస్తున్న వారధి పనులు వేగం పుంజుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: