ఈనాడు దిన పత్రిక.. తెలుగులో అగ్రశ్రేణి దిన పత్రిక. కేవలం వార్తలు ఇవ్వడమే తమ పని అనుకోకుండా అనేక సమయాల్లో ఈనాడు దిన పత్రిక.. బాధితులకు సాయం అందించింది. ప్రత్యేకించి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను తన వంతుగా ఆదుకుంది. ప్రజలకూ, బాధితులకూ వారధిగా నిలిచి జనంలో మానవత్వం పెంచింది. తుపాన్లు, భూకంపాల సమయంలో ఈనాడు సహాయ నిధిని నెలకొల్పుతుంది.

 

ముందుగా తన వంతు సాయం ప్రకటించి.. తర్వాత దానికి ప్రజల విరాళాలు జత చేస్తుంది. ఎవరు ఎంత విరాళం ఇచ్చింది పక్కా లెక్కలతో ఏరోజుకు ఆరోజు ప్రచురిస్తుంది. మొత్తం విరాళాలతో బాధితులకు అవసరమైన సాయం అందిస్తుంది. గతంలో తుపానుల సమయంలో సూర్య భవనాలు నిర్మించి ఇచ్చింది. సునామీ సమయంలోనూ బాధితులను ఆదుకుంది. దాదాపు రెండేళ్ల క్రితం కేరళలో వరదలు వచ్చిన వేళ... కూడా ఈనాడు అదే బాధ్యతతో వ్యవహరించింది.

 

రామోజీ గ్రూప్.. మొదట రూ. 3 కోట్లతో తొలి విరాళం అందించింది. ఆ తర్వాత ఈనాడు పాఠకులు మరో నాలుగు కోట్ల రూపాయలు అందించారు. మొత్తం అలా జమకూడిన మొత్తంతో ఈనాడు కేరళలో 121 గృహాలు నిర్మించింది. ఆదివారం కేరళ వెళ్లిన ఈనాడు ఎండీ కిరణ్.. కేరళ సీఎం విజయన్ చేతుల మీదుగా... ఈ ఇళ్ల తాళాలు లబ్దిదారులకు అందించారు.

 

కేరళ బాధితులకు సాయం అందించేందుకు కేరళ ప్రభుత్వం కంటే ఈనాడే ఎక్కువ తపనపడిందని ఆ రాష్ట్ర సీఎం అన్నారు. ముందుకొచ్చి బాధితులను ఆదుకున్నందుకు రామోజీ గ్రూప్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు విజయన్‌ చెప్పారు. కేరళ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా నిలిచిన తెలుగు ప్రజలకు ఈనాడు ఎండీ కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉంటుందని కిరణ్ చెప్పారు. తెలుగు ప్రజలు ఈ దిశగా తమకు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: