తమకు 151 సీట్లు రాకుండా ఉంటే బావుండేదని ఓ వైసీపీ మంత్రి గారు అంటున్నారట. ఎందుకంటే అంత భారీగా మెజారిటీ వచ్చేసిరిక జగన్ కు కన్నూ మిన్నూ కానడం లేదట. ఎవరినీ లెక్కచేయడం లేదట. అందుకే.. అయినా ప్రజలు కూడా ఇలా ఒక పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇవ్వకూడదు. ఇంత మందబలం ఉన్నప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుందని సదరు మంత్రిగారు అన్నారట. మరి అది ఎక్కడ అన్నారో తెలియదు. ఓప్రైవేటు సంభాషణలో అన్నారని ఏబీఎన్ రాధాకృష్ణ రాసుకొచ్చారు.

 

బహుశా ఆయన చెవిలో చెప్పారేమో అని వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఇంకా ఏం రాశారంటే.. జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాలను మీడియా మాత్రమే కాదు.. సొంత పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు కూడా ఆక్షేపిస్తున్నారట. అయితే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేయడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారట. మా ముఖ్యమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవలసిన తరుణం ఆసన్నమైందని ఒక మంత్రి ఇటీవల ప్రైవేట్‌ సంభాషణలలో వ్యాఖ్యానించారట.

 

‘‘ఏం చేస్తాం.. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంది మంత్రులను తప్పించి కొత్తవారితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుంటానని మా వాడు మొదట్లో ప్రకటించాడు కదా? మంత్రులుగా కొనసాగే పది శాతంలో ఉండటానికే మేం ఇలా చొక్కాలు చించుకుంటున్నాం’’ అంటూ ఆ మంత్రి అసలు గుట్టు విప్పేశారట.

 

అంతేనా.. ‘శాసనసభ్యుల సంగతి దేవుడెరుగు.. మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్‌ లభించదు. అయినా భజన చేయక తప్పడం లేదు. మేం ఎవరిని ఏ రేంజ్‌లో తిట్టాలో స్ర్కిప్టు పంపుతారు.. ఆ ప్రకారమే తిట్టి పోస్తున్నాం. మాకు టికెట్లు ఇచ్చి గెలిపించింది అందుకే అని సర్దిచెప్పుకొంటున్నాం’’ అని అక్కడే ఉన్న ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారట. అయితే రాధాకృష్ణ రాతలన్నీ జగన్ సర్కారును ఇబ్బంది పెట్టేందుకేనని.. ఎవరు అన్నా అనకపోయినా.. అనేశారని ఆయన రాస్తుంటారని వైసీపీ నాయకులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: