విజయవాడలో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సోదాలు గురువారం మొదలుకాగా ఐదు రోజులైనా సోదాలు కొనసాగుతూ ఉండటం గమనార్హం. విజయవాడ గాయత్రీనగర్ లోని కంచుకోట ప్లాజాలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. రహస్య లాకర్ నుండి విలువైన వస్తువులు, రహస్య పత్రాలు, డైరీని అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. 
 
ఐటీ అధికారులు శ్రీనివాస్ సన్నిహితులు మరియు బంధువుల గురించి కీలక వివరాలను సేకరిస్తున్నారు. లాకర్ లో దొరికిన పత్రాల గురించే గత నాలుగు రోజులుగా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆధారాలు రాబట్టే పనిలో భాగంగానే గత ఐదు రోజులుగా శ్రీనివాస్ ను ఆయన సతీమణిని అధికారులు విచారిస్తున్నారని సమాచారం. గతంలో ఐటీ అధికారులు ఇన్నిరోజులు సోదాలు చేసిన దాఖలాలు ఎప్పుడూ కూడా లేవు. 
 
వందల కోట్ల ఆస్తులు బయటపడిన సమయాల్లో కూడా ఐటీ సోదాలు రెండు మూడు రోజుల్లో ముగిశాయి. పక్కా ఆధారాలతోనే ఐటీ అధికారులు శ్రీనివాస్ పై ఐటీ దాడులు జరిపారని సమాచారం. లోకేశ్ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన రాజేశ్ సంస్థలపై, రాజేశ్ ఇంటిపై కూడా దాడులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డిపై కూడా కడప జిల్లాలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. 
 
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు కంపెనీపైనా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందాలు ఏక కాలంలో గత ఐదు రోజుల నుండి దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల గురించే విజయవాడ నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐదు రోజుల నుండి దాడులు జరుగుతూ ఉండటంతో టీడీపీ నేతల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఐటీ అధికారుల విచారణలో ఏయే టీడీపీ నేతల పేర్లు, వారి బినామీల పేర్లు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: