ఆడవాళ్లపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఏ మాత్రం భయం లేకుండా ఆడవారిని అతి కిరాతకంగా చంపేసి మనలోనే మృగాళ్ల లాగా ఎంతోమంది సంచరిస్తుంటే భవిష్యత్తులో ఈ ఈ దేశం ఏమైపోతుందో ఊహించడానికే భయమేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఒక మహిళా లెక్చరర్ కి ఒక దుండగుడు నిప్పంటించిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.


వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి మూడవ తారీకున ఉదయం ఏడు గంటలకు మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో హింగంఘాట్ సిటీకి చెందిన అంకిత అనే 24 ఏళ్ల మహిళా లెక్చరర్ తన కాలేజీకి బస్సులో బయలుదేరింది. కొద్దిసేపటికి అదే బస్సును ఆమెను కొంతకాలంగా ఫాలో చేస్తున్న విక్కీ అనే వ్యక్తి ఎక్కాడు. తర్వాత అంకిత వద్దకు వెళ్లి ఆమెకు నిప్పంటించి అక్కడి నుండి పారిపోయాడు. బస్సులో ఉన్న మిగతా వాళ్ళు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మంటలను ఆర్పి ఆమెను రక్షించేందుకు నీటిని పోశారు. కానీ అప్పటికే ఆమె శరీరం 40 శాతం వరకు కాలిపోయింది. తరువాత ఆమెను నాగపూర్ లోని ఆరంజ్ సిటీ హాస్పిటల్ కి తరలించారు. ఆ రోజు నుండి ఈరోజు ఉదయం వరకు ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. చివరికి 6 గంటల 55 నిమిషాలకు ఆమె తన తుది శ్వాస విడిచింది. ఈ రోజున ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం చేయిస్తామని పోలీసులు తెలిపారు.


ఆ ఆసుపత్రి డాక్టర్లు మాట్లాడుతూ.. గత ఏడు రోజులుగా ఆమె కాలిన గాయాలతో నరకయాతన అనుభవించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ దాడికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు ఆమె మరణానికి కారకుడైన విక్కీని ఉరి తీయాలని కాలేజీ టీచర్స్, స్టూడెంట్స్ తో సహా 7000 హింగంఘాట్ ప్రజలు నిరసనలు, ర్యాలీలు చేస్తున్నారు. ఏదేమైనా ఎంతో కష్టపడి చదువుకుని, ఉద్యోగం సాధించిన ఓ యువతిని కిరాతకంగా చంపేసిన విక్కీ అనే మానవ మృగానికి కఠిన శిక్ష పడాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: