అటవీ శాఖాధికారుల అలసత్వం నల్లమల అడవుల పాలిట శాపంగా మారింది. నల్లమలలో వరుస అగ్ని ప్రమాదాలు జరగటం ప్రకృతి ప్రేమికుల కలవరానికి కారణమవుతోంది. వందలాది హెక్టార్లలో విలువైన వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవుతోంది. పదుల సంఖ్యలో వన్య ప్రాణులు మంటల దాటికి మృత్యువాత పడుతున్నాయి. 

 

 నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల హెక్టార్లలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో లక్షా 75 వేల హెక్టార్లు టైగర్ రిజర్వ్ ఫారెస్టుగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా అడవి మొత్తం దగ్దం అవుతుంది. వన్య ప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇటీవలి కాలంలో ఇక్కడ వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే మూడు చోట్ల అడవి దగ్దమైంది. ఐతే...అగ్నిప్రమాదాలకు కారాణాలు అన్వేషిస్తే చాలానే కనిపిస్తున్నాయి.  

 

శ్రీశైలం, మద్దిమడుగు పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు నల్లమల అడవుల గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ యాత్రికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నల్లమల టైగర్ రిజర్వ్ జోన్ మీదుగానే వీరంతా ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలోనే అగ్నిప్రమాదాలు జరగటం ప్రకృతి ప్రేమికులను కలవర పెడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సేద తీరేందుకు నల్లమలలో ఆగుతుంటారు. అడవిలోనే వంటావార్పు చేసుకుంటారు. కొందరు చుట్ట-బీడి-సిగరెట్లు యథేచ్ఛగానే కాలుస్తుంటారు. ఆ నిప్పురవ్వలు ఎగసి అడవిలో పడి అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా హెక్టార్ల విస్తీర్ణంలో అడవి తగలబడిపోతోంది. 

 

నల్లమలలో అగ్ని ప్రమాదాలు జరగటంతో వందల ఎకరాల్లో విస్తరించిన చెట్లు, ఔషద మొక్కలు కాలి బూడిదవుతున్నాయి. శ్రీశైలం మార్గంలో వటవర్లపల్లి సమీపంలోని ఎర్రకురువ వద్ద మొదటి అగ్నిప్రమాదం జరిగింది. ఆ మంటలు వ్యాపించడంతో 15 ఎకరాల మేర అడవి దగ్దమైంది. అటు వైపుగా వెళ్లే ప్రయాణికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. ఇక దోమల పెంట  సమీపంలోని ఉరుమంట దగ్గర అడవిలో మంటలు వ్యాపించాయి. సుమారు ఐదు కిలోమీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతైంది. దోమలపెంట సమీపంలో ఆక్టోపస్ దృశ్య కేంద్రం వద్ద మంటలతో సుమారు మూడు ఎకరాల అడవి దగ్దమైంది. ఈ ప్రమాదాలతో అడవిలోని చెట్లు, పొదలు కాలి బూడిదయ్యాయి. 

 

నల్లమల అటవీ ప్రాంతంలో వంటావార్పులను నిషేధించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అడవుల్లో గస్తీ మరింత ముమ్మరం చేసి అగ్ని ప్రమాదాలకు చెక్ పెట్టాలి. ఇప్పటికైనా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: