మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు త్వరితగతిన చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పోలీస్‌ స్టేషన్‌ను టీడీపీ మహిళ ఎమ్మెల్యే ఆశ్రయించారు. వైసీపీ ప్రభంజనంలోనూ రాజమండ్రి నగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధించారు.


అయితే తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెట్లు పెడుతున్నారని రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆదిరెడ్డి భవానీ. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రాచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఫిర్యాదులో పేర్కొన్నారు. భవానీతో పాటు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.


గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా ఆదిరెడ్డి భవానీ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సోషల్‌ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్లు పెడుతున్నారని అసెంబ్లీ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు. అంతేకాదు దిశ చట్టం నా నుంచే మొదలు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నారు. అప్పుడు ప్రభుత్వం తరుపున స్పందించిన హోం మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు స్వయంగా ఆమె పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ ఇవ్వటంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు.


ఇటీవల వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజినీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను దూషిస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు సత్యంరెడ్డి, ప్రవీణ్ లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు. ఆ పోస్ట్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: