మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఒక సైకో అని సీఎం జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎవరైనా వద్దంటారా...? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు అన్నీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చంద్రబాబు చెప్పారు. 
 
వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అధికారులకు జీతాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తోందని అన్నారు. సీనియర్ ఆఫీసర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేయడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం సీఐడీ ఎంక్వైరీ ఎంతమంది తెల్ల రేషన్ కార్డ్ లబ్ధిదారులపై వేయిస్తుందని ప్రశ్నించారు. 
 
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నాలు చేస్తోందని ఎవ్వరూ భయపడరని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానిది చేతకాని పరిపాలన, దద్దమ్మ పరిపాలన అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అన్నీ తప్పుడు పనులు చేస్తూ తిరిగి తమ పైనే దాడులు చేస్తోందని చంద్రబాబు అన్నారు. విజయవాడ నగరంలోని హెల్ప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
రెండు రోజుల క్రితం ఇద్దరు విద్యార్థులు అమరావతి పరిరక్షణ సమితి కోసం చేపట్టిన దీక్షలో కళ్లు తిరిగి పడిపోయారు. విద్యార్థులను పరామర్శించటానికి వచ్చిన చంద్రబాబు నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. వైస్ ఛాన్సులర్ ప్రవర్తన దారుణంగా ఉందని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. వైస్ ఛాన్సులర్ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైస్ ఛాన్సులర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని చంద్రబాబు అన్నారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: