ఒక ఐపీఎస్ స్థాయి అధికారి తన కన్నబిడ్డలను చూడటం కోసం రోడ్డెక్కాడు. తన పిల్లలను కలవటానికి ప్రయత్నించగా మాజీ భార్య నిరాకరించటంతో రోడ్డుపైనే కూర్చుని నిరసనను వ్యక్తం చేశాడు. కన్నతండ్రిని బిడ్డలను చూడటానికి నిరాకరించిన అతని మాజీ భార్య కూడా ఐపీఎస్ కావడం గమనార్హం. పూర్తి వివరాలలోకి వెళితే బెంగళూరులోని కాలబురగిలో పోలీస్ అంతర్గత విభాగంలో ఎస్పీగా ఐపీఎస్ అధికారి అరుణ్ రంగరాజన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
డీసీపీ స్థాయి అధికారిణిగా అరుణ్ రంగరాజన్ మాజీ భార్య వేరే చోట పని చేస్తోంది. గతంలో వీరిద్దరూ చత్తీస్ గఢ్ లో పని చేస్తే సమయంలో ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. చత్తీస్ గఢ్ లో నివాసం ఉంటున్న సమయంలోనే వీరిద్దరికీ తొలి సంతానం కలిగింది. కానీ ఆ తరువాత భార్యాభర్తల మధ్య కొన్ని విబేధాలు వచ్చాయి. తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో కలిసి బ్రతకటం కంటే విడిపోవటమే మేలని నిర్ణయం తీసుకున్నారు. 
 
విడాకుల కోసం వీరిద్దరూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో వీరిద్దరికీ రెండో సంతానం కూడా కలిగింది. ఫ్యామిలీ కోర్టు 2015లో వీరువురికీ విడాకులను మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు ప్రకారం పిల్లలు రంగరాజన్ భార్య దగ్గరే ఉన్నారు. తన పిల్లలను చూడాలని రంగరాజన్ నిన్న సాయంత్రం బెంగళూరులోని వసంత్ నగర్ కు చేరుకొని పిల్లల్ని చూడటానికి ప్రయత్నించగా మహిళ మాత్రం ఐపీఎస్ అధికారిని ఇంట్లోకి రానివ్వలేదు. 
 
తన పిల్లలను చూసే వరకు తాను అక్కడినుండి వెళ్లనని రంగరాజన్ తన భార్య ఇంటి ముందే నిరసనకు దిగాడు. అధికారిణి తన మాజీ భర్త తనను వేధిస్తున్నాడని కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వగా కంట్రోల్ రూం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని నచ్చజెప్పటానికి ప్రయత్నం చేశారు. తన పిల్లలను చూసేవరకు అక్కడినుండి వెళ్లనని రంగరాజన్ చెప్పటంతో సిబ్బంది చేసేదేం లేక అక్కడినుండి వెళ్లిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: