పాలమూరు జిల్లాలో సహకార ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. డీసీసీబీ చైర్మన్ పదవి కోసం టీఆర్ఎస్‌లో రేసు మొదలైంది. కుర్చీ దక్కించుకునేందుకు అన్ని స్థాయిల్లోని నేతలు అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టారు. హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులంతా తెలంగాణ భవన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రులు...పార్టీ ముఖ్య నేతల ఆశీస్సుల కోసం ఏకంగా హైదరాబాద్‌కే క్యూ కడుతున్నారు. 

 

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సహకార ఎన్నికల సమరం మొదలైంది. జిల్లాలో పీఏసీఎస్ లను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీబీపై జెండా ఎగురేసేందుకు గులాబీ పార్టీ తహతహలాడుతోంది. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్లు లాబీయింగ్ మొదలు పెట్టారు. చోటామోటా లీడర్లు సైతం తమదైన రీతిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జడ్పి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లుగా అవకాశాలు రాని నాయకులు డీసీసీబీ  చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సహకార ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. 

 

నిజానికి...జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి సహకార శాఖలో చాలా కీలకమైంది. ఈ పదవి పాలమూరులో ఎవరిని వరిస్తుందోననే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాల విభజన జరిగినా డిసిసిబి మాత్రం పాత జిల్లాల పరిధిలోనే కొనసాగుతోంది. ఫలితంగా ఈ పదవికి ప్రాధాన్యం గతంలో కంటే కూడా పెరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 87 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇక్కడ డీసీసీబీ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. పదవీ ప్రాధాన్యత దృష్ట్యా అందరిని కలుపుకుపోయే స్వభావం ఉన్న వ్యక్తినే ఈ ఛైర్మన్ పదవికి ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు జిల్లాకు చెందిన మంత్రులతో పాటు కేటిఆర్ ఆశీస్సుల కోసం హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. 

 

ఇక...పాలమూరు డీసీసీబీ అధ్యక్ష పదవికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన హుస్నాబాద్ పీఏసీఎస్  నుంచి నామినేషన్ దాఖలు చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ సమయంలోనే గుర్నాద్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హమీ ఇచ్చింది. అయితే ...ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇప్పుడు ఆయన కూడా డీసీసీబీ చైర్మన్ పదవిపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్‌కు చెందిన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జక్కా రఘునందన్ రెడ్డి కూడా డీసీసీబీ చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి కేటిఆర్ వద్ద ఈయన లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు...జూపల్లి భాస్కర్ రావు, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మామిళ్లపల్లి విష్ణువర్దన్ రెడ్డి, మహబూబ్ నగర్ నియోజక వర్గం నుంచి కొరమోని వెంకటయ్య, బాలానగర్ మాజీ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డిలు డీసీసీబీ  చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

 

మొత్తం మీద పాలమూరు డీసీసీబీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. అయితే అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందనేది మాత్రం ఇప్పటికైతే అంతుబట్టడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: