పార్ల‌మెంటు కేంద్రంగా మ‌రోమారు అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగా...రాజ‌కీయ పార్టీలు త‌మ వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ట్రాల‌ అభీష్టమని, కోటాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పదోన్నతుల్లో కోటా పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదని,రిజర్వేషన్లు కల్పించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని  ఉత్తరాఖండ్‌ కేసులో శుక్రవారం తేల్చిచెప్పింది. దీంతో, ఈ విష‌యంలో ఆయా పార్టీలు కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

 

 

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. రిజర్వేషన్ల కోటా అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ వేయాలని ఎన్డీయేతర ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ తీర్పుపై కాంగ్రెస్‌తోపాటు లోక్‌జనశక్తి పార్టీ అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని వ్యా ఖ్యానించాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్‌ వేయాలని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ కూడా కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  ఇలా విపక్ష ఎంపీలు, మిత్ర‌ప‌క్ష నేత‌లు సభలో ఆందోళనకు దిగడంతో.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. ఇది సున్నిత అంశమని, కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేయడం తగదు అని ఆయన అన్నారు. రిజర్వేషన్ల కోటా అంశంపై సోషల్‌ వెల్ఫేర్‌ మినిస్టర్‌ లోక్‌సభలో ప్రకటన చేస్తారని రాజ్‌నాథ్‌ సభలో తెలిపారు.  

 


ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు నేడు మ‌రో సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఎస్సి, ఎస్టి కేసుల్లో ప్రాథమిక విచారణ జరపాల్సిన అవసరం లేదని చెప్పింది. అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ పోలీస్ అధికారుల అనుమతి కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం రివ్యూ పిటిషన్ వేసింది. ఈ రివ్యూ పిటిషన్ పై జస్టిస్ అరుణ్ మిశ్రా,  జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిలుకు అవకాశం కల్పించకూడదని సుప్రీం చెప్పింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఉంటుందని చట్ట సవరణ చేయడంతో.. కొత్త చట్టాన్ని సుప్రీంకోర్ట్ సమర్థించింది. అసాధారణమైన పరిస్థితులలో FIRలను కోర్టులు కొట్టేయొచ్చని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: