సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎంత ఖచ్చితమైన అభిప్రాయంతో జగన్ ఉన్నారో అంతే ఖచ్చితంగా తాను తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు జగన్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ సీఎం గా జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతూనే ఉంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి జగన్ నిర్ణయాలు మింగుడు పడడంలేదు. ఆ పార్టీని దెబ్బతీసే విధంగా జగన్ రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో అవినీతి వ్యవహారాలు ప్రభుత్వంలో కానీ, పార్టీ నాయకులు పాల్పడకుండా జగన్ సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. 


ప్రధానంగా రాజధాని మార్పునే తీసుకుంటే ఇది ఒక సంచలన నిర్ణయం. టిడిపి ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలకు నిదర్శనంగా అమరావతి ఉందని భావించిన జగన్ దానిని అక్కడ నుంచి మార్చాలని ముందుగా అనుకున్నా తరువాత మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు.దీనిపై టిడిపి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూనే ఉంది. ఈ విషయంలో కేంద్రం కూడా పార్లమెంటులో రాజధాని అంశం తమ పరిధిలోనిది కాదని, అది రాష్ట్ర వ్యవహారం అని, ఇందులో తాము జోక్యం చేసుకోమని పదేపదే ప్రకటన కూడా చేసింది.


 అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వెనుక కేంద్రం ఉందని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిజం చేస్తూ టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ బాంబు పేల్చారు. మూడు రాజధానులు రాబోతున్న విషయం తనకు ముందే తెలుసునని, అప్పట్లో ఒంగోలు రాజధాని అవుతుందని అనుకున్నామని, కానీ అక్కడ కొన్ని సమస్యలు ఉండడం వల్ల జగన్ విశాఖకు రాజధానిని మార్చారని ఆయన చెప్పారు. ఇక కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సముఖంగా ఉందని, జగన్ చెబుతున్న పాలనా వికేంద్రీకరణకు కేంద్రం సహకరిస్తుంది అని ఆయన చెప్పారు.


 జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మోదీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అన్నట్టుగా టీజీ వెంకటేష్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అసలు కేంద్రమే ఈ మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చింది అనేది అందరిలోనూ ఇప్పుడు కలుగుతున్న అనుమానం. టిడిపి నాయకుల పై అవినీతి అక్రమాలు బయట పడటం వెనుక కూడా కేంద్రం జగన్ కు సంపూర్ణంగా సహకరిస్తోందని రకరకాల కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ ,జగన్ ఒకరినొకరు కలిసి చర్చించుకోకపోయినా కేంద్రం అండతోనే జగన్ ఈ విధంగా వివాదాస్పదంగా ఉన్న కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీలో పరిపాలనను గాడిలో పెట్టేందుకు ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: