ఏపీలో విద్యుత్‌ చార్జీలు పెరగనున్నాయి. నెలలో 500 యూనిట్లకు మించి విద్యుత్‌ ను వినియోగించేవారికి.. యూనిట్‌కు 90పైసలు చొప్పున పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ ధర 9 రూపాయల 5 పైసలుగా ఉండగా.. ఇప్పుడు 9 రూపాయల 95పైసలుగా టారిఫ్‌ నిర్ణయించింది. ఈ భారం కార్పొరేట్‌ సంస్థలతో పాటు రాష్ట్రంలోని 1.35లక్షల గృహ వినియోగదారులపై పడనుంది.

 

విద్యుత్‌ పంపిణీ సంస్థలను నష్టాల నుంచి బయటపడేసేందుకు.. ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు చార్జీలు పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ తూర్పు విద్యుత్‌ పంపిణీ  సంస్థ, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు 2020-21 సంవత్సరానికి గాను, 14వేల349 కోట్ల ఆదాయం అవసరమవుతుందని అంచనా వేసినట్టు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్‌ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. ఈ లోటును భర్తీ చేసేందుకే.. చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.

 

పెంచిన విద్యుత్‌ ఛార్జీల కారణంగా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలపై 1300 కోట్ల భారం పడనుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి 2893.48 కోట్ల ఆర్థిక భారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థల నికర లోటును 10,060.63 కోట్లుగా నిర్థారించారు. రైతులు వినియోగించే విద్యుత్‌ కోసం 8,353.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. 

 

రాష్ట్రంలో 9,500 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉందని, అందుకే ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతి నిరాకరించినట్టు అధికారులు తెలిపారు. ఈసారి వ్యవసాయ విద్యుత్‌ కోసం పక్కా ప్రణాళిక రూపొందించామని, రైతులకు 9గంటల విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. అయితే, ప్రభుత్వ సబ్సిడీ పెరిగిందని, క్రమంగా సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపింది. విద్యుత్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక లోటును తీర్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: