సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్ బాగ్ దగ్గర నిరసన తెలుపుతున్న నిరసనకారుల్ని ఖాళీ చేయించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేసింది. అయితే నాలుగు నెలల చిన్నారి చలికి మృత్యువాత పడటాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీం.. దీనిపై కేంద్రానికి, ఢిల్లీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. 

 

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్ బాగ్ లో జరుగుతున్న నిరసనల్లో విషాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి చలికి తాళలేక చనిపోయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలు శిబిరంలో ఉన్నా.. కేంద్రం స్పందించడం లేదని ఆందోళనకారులు మండిపడుతుంటే.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వ్యతిరేకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రహదారిని ఎలా దిగ్భందిస్తారని షహీన్‌బాగ్‌ నిరసనలను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. షహీన్‌బాగ్‌ నుంచి నిరసనకారులను ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ సందర్భంగా.. ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే శిబిరం ఖాళీ చేయించాలన్న డిమాండ్ ను తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.  నిరసనల్లో పాల్గొంటూ చలిని తాళలేక నాలుగు నెలల చిన్నారి మృత్యువాతన పడటంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అసలు ఆ ప్రాంతానికి చిన్నారిని ఎవరు తీసుకువెళ్లారని కోర్టు ప్రశ్నించింది.

 

చిన్నారి మరణాన్ని కోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకోవడంపై కొందరు న్యాయవాదులు వ్యతిరేకించడం పట్ల సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆందోళనకారులు రోడ్డును బ్లాక్‌ చేసి ఇతరులకు అసౌకర్యం కలిగించరాదని స్పష్టం చేసింది. తర్వాతి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. మొత్తానికి సుప్రీం కోర్టు సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. వివరణ కోరుతూ ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి నోటీసులు పంపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: