తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయల నిధులిస్తున్నామని కేంద్రం పార్లమెంట్ లో చెప్పింది. తెలంగాణకు గత ఆరేళ్లుగా ఇచ్చిన నిధులతో పాటు.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులిచ్చారో కూడా తెలిపింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ నిధులపై ప్రశ్నించగా.. సుజనా చౌదరి పోలవరం నిధులపై క్లారిటీ కోరారు. 

 

పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్రం తెలిపింది. పోలవరం నిర్మాణంపై ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు.. కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయాలన్న గడువును.. 2021 నాటికి సవరించారని పేర్కొంది. ప్రాజెక్టులో వివిధ భాగాల కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో గడువు పొడిగించారని చెప్పింది. 2018-19లో ప్రాజెక్టు కోసం 3,047 కోట్లు ఖర్చు చేశారని, కేంద్రం 1400 కోట్లు ఇచ్చిందని ఆన్సర్ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతిపాదనల మేరకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం  8,614 కోట్లు విడుదల చేసిందని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల ఆడిట్ జరగకుండా నిధుల విడుదల చేసేది లేదని.. ఆర్థిక శాఖ నవంబర్ 26, 2019న నోట్ ఇచ్చినట్టు కేంద్రం స్పష్టం చేసింది. 

 

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా.. గడచిన ఆరేళ్లలో  తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలు కూడా కేంద్రం వెల్లడించింది. 2014-15లో తెలంగాణ  మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రమని చెప్పిన కేంద్రం.. తర్వాత అప్పులు పెరుగుతూ వచ్చాయని చెప్పింది. ఆరేళ్లలో పన్ను వాటా కింద తెలంగాణకు 85, 013 కోట్లు ఇచ్చినట్లు సభకు చెప్పింది. రాష్ట్రాల విపత్తుల నిధి కింద 1289.4 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద 6511 కోట్లు రూపాయలు, ప్రత్యేక సాయం కింద వెనుకబడిన జిల్లాలకు 1916 కోట్ల రూపాయలు ఇచ్చామంది. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 3853 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద  51, 298.84 కోట్లు విడుదలయ్యాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 1500.54 కోట్లు వచ్చాయని ఆర్థిక మంత్రి లిఖితపూర్వక సమాధానం చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: