అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఢిల్లీ ఎన్నిక‌ల్లో కొత్త వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా? అనే సందేహాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తుది పోలింగ్‌ శాతాన్ని ప్రకటించడంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జాప్యం చేయడంపై అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప‌లు సంఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రిస్తూ...ఆప్ నేత‌లు వ‌రుసగా స్పందించ‌డం, దీనికి ఈసీ క్లారిటీ ఇవ్వ‌డంతో...ప్ర‌స్తుత చ‌ర్చ జ‌రుగుతోంది. 

 

 

70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయి ఒకరోజు దాటినా తుది పోలింగ్‌ శాతాలను ఈసీ ఎందుకు ప్రకటించలేదన్నది ఆశ్చర్యకరమని ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుమానాలు వ్య‌క్తం చేశారు. ‘పోలింగ్‌ పూర్తయిన ఒకరోజైనా వారు (ఈసీ) ఎందుకు తుది పోలింగ్‌ శాతాలను ప్రకటించలేదు?’ అని ప్రశ్నించారు. ‘ఈసీ తీరు ఖచ్చితంగా దిగ్భ్రాంతికరం.. షాకింగ్‌' అని పేర్కొన్నారు. ‘బీజేపీ కార్యాలయం నుంచి తుది పోలింగ్‌ శాతం వివరాలు ఈసీకి అందలేదా?’ అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ప్రశ్నించారు. మ‌రోవైపు,  ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్‌ పూర్తయి ఒకరోజైనా తుది పోలింగ్‌ శాతాన్ని ఈసీ వెలువరించకపోవడంతో తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ‘ఒకవేళ ఈవీఎంలలో బీజేపీ ఏదైనా చేస్తుందా? అన్నది అనుమానంగా ఉన్నది. తెర వెనుక రహస్యంగా ఏదో మతలబు జరుగుతున్నది’ అని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు.

 


త‌న సందేహాల‌కు గ‌ల కార‌ణాల‌ను సైతం సంజ‌య్ సింగ్ వెల్ల‌డించారు. ఆప్‌ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల వల్ల బీజేపీ.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సంజయ్‌సింగ్‌ రెండు వీడియోలను మీడియాకు విడుద‌ల చేశారు. బాబర్‌పూర్‌ అసెంబ్లీ స్థాన పరిధిలోని సరస్వతి విద్యానికేతన్‌ స్కూల్‌లో పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంను రిజర్వు పోలీసు (బలగాల) భద్రత లేకుండానే ఒక అధికారి తీసుకెళుతున్న దృశ్యంతో కూడిన వీడియో ఒక‌టి కాగా...ఇదే స్థానం పరిధిలో మరో కేంద్రంలో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. మరో వీడియోలో బస్సు నుంచి బయటకు తెచ్చిన ఈవీఎంను ఓ వీధిలో మోసుకెళ్తుండటం కనిపిస్తున్నదని, ఇక్కడికి సమీపంలో ఈసీ కేంద్రాలు లేవని, దీనిపై ఈసీ దర్యాప్తు జరుపాలని సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. కాగా, ఆప్ నేత‌ల సంచ‌ల‌న కామెంట్ల నేప‌థ్యంలో.... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రణబీర్‌ సింగ్ స్పందించారు. ఢిల్లీలో 62.59 శాతం నమోదైందని తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఐదు శాతం పోలింగ్‌ తగ్గిందన్నారు. తుది పోలింగ్‌ శాతాన్ని వెల్లడించడంలో జాప్యానికి అన్ని స్థానాల్లో పోలింగ్‌పై ఖచ్చితత్వం కోసం ప్రయత్నించడమే కారణమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: