ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు హక్కు కాదన్న సుప్రీం జడ్జిమెంట్.. పార్లమెంట్ లో దుమారం రేపింది. రిజర్వేషన్లు ఎత్తేయాలన్న ఆరెస్సెస్ అజెండాను బీజేపీ అమలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే గంభీరమైన అంశాల్ని రాజకీయం చేయొద్దని కాషాయ పార్టీ కౌంటరిచ్చింది. 

 

షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించడానికి సంబంధించి  సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2012 సెప్టెంబర్‌ 5న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఆ ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 

 

సుప్రీం తీర్పు రిజర్వేషన్లకే ఎసరు పెట్టేలా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆరెస్సెస్ అజెండాను బీజేపీ అమలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ లో కూడా ఈ అంశంపై రగడ జరిగింది. రిజర్వేషన్ల రద్దుపై కేంద్రం మనసులో మాట ఇదేనని కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు.అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ దీన్ని తిప్పికొట్టారు. 

 

రిజర్వేషన్ల అంశంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ప్రకటన చేస్తారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. 2012లో ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ సర్కారే ఉందని ఆయన గుర్తుచేశారు. అటు రాజ్యసభలో కూడా రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ నేత ఆజాద్ లేవనెత్తారు. దీంతో ఈ అంశంపై లోతుగా చర్చించిన తర్వాత సముచిత నిర్ణయం తీసుకుంటామని కేంద్రం బదులిచ్చింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: