నిజం చెప్పులు వేసుకునే లోపు... అబద్దం ప్రపంచాన్నే చుట్టేస్తుందట. కరోనా విషయంలోనూ అదే జరుగుతోంది. గంటకో పుకారు... రోజుకో ప్రచారం.! నిజానిజాలు తెలుసుకోకుండానే అతిజాగ్రత్తకు వెళ్తున్నారు జనం. చికెన్‌ తినడం వల్లే కరోనా వస్తుందని.. కోడి రెక్కల్లో కరోనా వైరస్‌ పుట్టిందని రూమర్లు చక్కర్లు కొడుతుండటంతో.. చికెన్‌ అంటేనే హడలెత్తిపోతున్నారు. అప్పు చేసి పప్పు కూడైనా తినొచ్చు.. కోడికూర తిని కోరి కరోనాను అంటించుకోవడం ఎందుకంటున్నారు. 


 
కరోనా పేరు చెబితే ప్రపంచ దేశాలు హడలెత్తుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. ఇప్పుడు భారత్‌లోనూ భయోత్పాతాన్ని సృష్టించింది. అది తింటే వైరస్‌ సోకుతుంది.. ఇది తాగితే కరోనా వ్యాపిస్తుంది.. అంటూ సోషల్ మీడియా పుణ్యమా అని పూటకో ప్రచారం జరుగుతుండటంతో జనాలు హడలెత్తిపోతున్నారు. 

 

నిన్న మొన్నటి దాకా.. చైనా వాళ్లు, చైనా బజార్లు, చైనా ఫాస్ట్‌ ఫుడ్డు, చైనా వస్తువులు.. ఇలా.. చైనా అనే పేరు వినిపిస్తే చాలు.. దూరం జరిగారు జనాలు. ఇప్పుడు కరోనాపై మరో కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. చికెన్‌ వల్ల కరోనా వస్తోందని, కోడి రెక్కల కింద ఈ వైరస్‌ ఉంటుందని.. పుకార్లు మొదలయ్యాయి. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. 

 

ఈ ప్రచారంతో జనంలో కోడి అంటేనే వణుకు మొదలైంది. కోడికూర తింటే ఎక్కడ కరోనా వస్తుందోనని చాలామంది చికెన్‌ కు దూరంగా ఉంటున్నారు. ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియులు సైతం... శాఖాహారులుగా మారిపోయారు. 

 

వారాంతంలో కొనేవాళ్లు సైతం.. ఛీ అంటుంటడంతో చికెన్‌ కొనుగోళ్లు తగ్గాయి. దీంతో ధరలు అమాంతంగా పడిపోయాయి. అలాగని మటన్‌ కి డిమాండ్‌ పెరిగిందా అంటే అదీ లేదు. కరోనాకు ముందు.. కేజీ 220 ఉన్న చికెన్‌ ధర ఇప్పుడు 180, 190 రూపాయలుగా ఉంది. కరోనా మహమ్మారి సృష్టిస్తున్న భయాందోళనతో... ముందుజాగ్రత్త కాస్తా... అతిజాగ్రత్తగా మారిపోయింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లు నమ్మి.. జనాలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: