ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా సీనియర్లు ఉన్న పార్టీ ఏదైనా ఉందటే అది తెలుగుదేశం పార్టీనే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దాదాపు 38 ఏళ్ల నుంచి ఏపీలో మనుగడ సాగిస్తున్న టీడీపీలో అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. చాలామంది పార్టీలు మారిపోయినా, ఇంకా చాలామంది సీనియర్లు టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే రానున్న రోజుల్లో వయసు రీత్యా కావొచ్చు, అనారోగ్య కారణాల వల్ల కొందరు సీనియర్ నేతలు టీడీపీకి దండం పెట్టేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 

2019 ఎన్నికల్లోనే టీడీపీకి కొందరు టీడీపీ నేతలు దూరమయ్యారు. తమ వారసులని రంగంలోకి దించి వారు పక్కకు వెళ్ళిపోయారు. టీడీపీ సీనియర్లలో పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ తప్పుకుని...ఆయన కుమార్తె గౌతు శిరీషని, చీపురుపల్లిలో కిమిడి మృణాలిని తప్పుకుని...ఆమె తనయుడు నాగార్జునని, రాజమండ్రిలో మురళీమోహన్ తప్పుకుని..ఆయన కోడలు మాగంటి రూపని, పెడనలో కాగిత వెంకట్రావు తప్పుకుని...ఆయన కొడుకు వెంకట కృష్ణప్రసాద్‌ని ఎన్నికల బరిలో దింపారు.

 

ఇటు సీమలో జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, కేఈ కృష్ణమూర్తి లాంటి వారు పోటీ నుంచి తప్పుకుని వారి వారసులని రంగంలోకి దింపారు. అయితే వీరిలో మళ్ళి పరిటాల సునీత పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మిగతా వారంతా చల్లబడ్డట్లే. అయితే 2024 ఎన్నికలోచ్చేసరికి రాజకీయాల నుంచి మరింతమంది రిటైర్ కావొచ్చని తెలుస్తుంది. ఇప్పటికే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పేశారు.

 

విజయనగరం రాజావారు అశోక్ గజపతి రాజు కూడా పోటీకి దిగడం కష్టమే అని తెలుస్తోంది. అలాగే విశాఖలో బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న పాత్రుడులు కూడా సైడ్ అయిపోతారని అంటున్నారు. ఇక వీరితో పాటు మరికొందరు 2024లో టీడీపీకి దండం పెట్టడం ఖాయమని తెలుస్తోంది. మరి చూడాలి ఎంతమంది పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: