కేంద్ర ఆర్థిక‌మాంధ్యంతో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బ‌డ్జెట్‌లోనూ ఈ మేర‌కు ప‌లు అంశాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అయితే, తాజాగా వివిధ శాఖ‌ల‌కు ఆశించిన మేర‌కంటే త‌క్కువ కేటాయింపుల‌తో బ‌డ్జెట్ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ర‌క్ష‌ణ శాఖ కూడా ఉంది. సాయుధ బలగాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు నిరాశాజనకంగానే ఉన్నప్ప‌టికీ...అయితే రక్షణ బలగాల అధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ మాత్రం ఆశావహ దృక్పథంతో ఉన్నారు. తాజాగా ఆయ‌న కీల‌క అంశాల‌ను వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ భూముల ద్వారా ఆదాయాన్ని సముపార్జించి నిధుల కొరతను అధిగమించనున్నట్లు చెప్పారు.

 


ఒక జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రావత్ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వ్య‌క్తీక‌రించారు.  ‘బడ్జెట్‌ను మనం ద్రవ్య కోణంలో చూడకూడదు. ప్రభుత్వం మనకు రూ.2 లక్షల కోట్లు కేటాయించి.. వచ్చే రెండేళ్ల‌లో ఆధునీకరించాలంటే సాధ్యమవుతుందా?  సాధ్యం కాదు. ఎందుకంటే మనకు కావాల్సినవి బహిరంగ మార్కెట్‌లో దొరికేవి కావు’ అని వివ‌రించారు. దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ భూముల ద్వారా ఆదాయాన్ని సముపార్జించి నిధుల కొరతను అధిగమించనున్నట్లు చెప్పారు. ‘ దేశవ్యాప్తంగా త్రివిధ దళాలకు సమారు 17.54 లక్షల ఎకరాల భూమి ఉన్నది. మౌలిక వసతుల అభివృద్ధికి వచ్చే 10 ఏళ్ల‌లో రూ.35 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది రక్షణ నిధుల నుంచి కాదు. రక్షణ శాఖ భూముల నుంచి ఆదాయం పొందొచ్చు. భారతమాల వంటి ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ భూములను కేటాయించి, అందుకు బదులుగా వారిని మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నెలకొల్పాలని కోరవచ్చు’ అని రావత్ విశ్లేషించారు.

 

 

సైన్యమూ ఆయుధ కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్న త‌రుణంలో.... బడ్జెట్‌ కేటాయింపులు సరిపోతాయా అని ప్రశ్నించగా రావ‌త్ ఆస‌క్తిక‌రంగా విశ్లేషించారు. ‘ప్రాధాన్యాలను మనం మొదట గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆధునీకరణలో త్రివిధ దళాల మధ్య సమతుల్యత మరిచిపోకూడదు. ఆయుధ కొనుగోళ్లు దశలవారీగా జరుగాలి. ఉదాహరణకు, మన యుద్ధ ట్యాంకులన్నీ రెండు మూడేళ్లులో కొనుగోళ్లు చేశామనుకో.. 20-30 ఏళ్ల‌కు ఒకేసారి వాటి జీవితకాలం తీరిపోతుంది. అలా ఉండకూడదు’ అని బదులిచ్చారు. నౌకాదళానికి మూడో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ కొనుగోలు విషయమై ప్రశ్నించగా.. ‘అవసరమైనప్పుడు దానిని కొనుగోలు చేస్తాం. పదేళ్ల‌ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అంచనా వేయలేం. హిందూ మహాసముద్ర ప్రాంతం లో మన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ద్వీప భూభాగాల సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది’ అని రావత్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: