విశాఖ పట్నం.. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కాబోతోంది. ఇందుకు జగన్ సర్కారు కట్టుబడి ఉంది. మహా అయితే ఓ రెండు, మూడు నెలలు.. అంతే.. ఆ తర్వాత అధికారికంగానే విశాఖ ఏపీ రాజధాని అవుతుంది. అయితే సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే శంకుస్థాపన చేసిన అమరావతి పరిస్థితి ఏంటి అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కనీసం కేంద్రంలో మోడీ సర్కారైనా జగన్ రాజధాని నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు.

 

ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అయితే.. రాష్ట్ర రాజధాని అంశంలో మేం జోక్యంచేసుకోం..అది ఆ రాష్ట్రం ఇష్టం అంటూ ఇప్పటికే కేంద్రం జగన్ అనుకూలవైఖరి అనుసరించింది. ఇక ఇప్పుడు మరోసారి పరోక్షంగా విశాఖకు కేంద్రం జై కొట్టింది. ఎలా అంటారా.. దేశంలోని 13 బీచ్‌లను అంతర్జాతీయ స్థాయి బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సంకల్పించింది. దీని కోసం బీచ్‌ ఎన్విరాన్‌మెంట్‌ &ఈస్థటిక్స్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌’.. బీమ్స్‌ అనే ప్రాజెక్ట్‌ రూపొందించింది.

 

ఈ ప్రాజెక్టులో దేశంలోనే పలు బీచ్ లను అభివృద్ధి చేస్తారు. అయితే ఈ జాబితాలో విశాఖకు చెందిన రిషికొండ బీచ్‌కు చోటు దక్కినట్లు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పారు. సోమవారం రాజ్యసభలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ప్రాచీన కోస్తా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణహిత బీచ్‌లుగా పర్యాటకలను ఆకర్షించే బీచ్‌లను రూపొందించడం బీమ్స్‌ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.

 

దేశంలోని కోస్తా తీరం కలిగిన రాష్ట్రాలలోని 13 బీచ్‌లను ఈ కార్యక్రమం కోసం గుర్తించినట్లు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అందులో ఆంధ్రప్రదేశ్‌లోని రిషికొండ బీచ్‌ ఒకటి అని అన్నారు. బీమ్స్‌ కార్యక్రమం కింద చేపట్టే బీచ్‌ల అభివృద్ధిలో భాగంగా బీచ్‌ పర్యాటకుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తారని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: