తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణ‌యం అమ‌లులోకి రానుంది. ఆర్టీసీ కార్మికుల విష‌యంలో...సంస్థ‌ను అభివృద్ధి బాట ప‌ట్టించేందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం అమ‌లులోకి రానుంది. గ‌త ఏడాది జ‌రిగిన  ఆర్టీసీ స‌మ్మెకు ముగింపు ప‌లికిన అనంత‌రం, ఆర్టీసీ స్థితిగతులపై, దాని పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఆర్టీసీ డిపో నుంచి ఐదుగురు చొప్పున ఉద్యోగులతో జనహితలో సమావేశం అయిన సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన హామీ ప్ర‌కారం ఆర్టీసీని లాభాల బాట‌లో ప‌ట్టించేందుకు స‌రుకు ర‌వాణ సేవ‌లు ప్రారంభించేందుకు స‌ర్వం సిద్ధ‌మైంది. కార్గో సేవల కోసం ఇప్పటికే  దాదాపు 50 బస్సులను సిద్ధంచేసిన అధికారులు.. వీటి సంఖ్యను 800కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 

 

ఆర్టీసీ స‌మ్మెకు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చి స‌మ్మెకు శుభం కార్డు వేసిన కేసీఆర్ అనంత‌రం ఇటు సంస్థ‌కు ఉద్యోగుల‌కు వరాల వర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే.  ఇందులో కార్గో సేవల అమ‌లు ఒక‌టి. సాక్షాత్తు సీఎం కేసీఆర్ తెలిపిన నేప‌థ్యంలో విజయవంతానికి వివిధ ప్రభుత్వశాఖలను భాగస్వాములను చేయాలని నిర్ణయించిన అధికారులు.. ఇప్పటికే పౌరసరఫరాలశాఖతో సంప్రదింపులు జరిపి, ప్రాథమిక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. పౌరసరఫరాలశాఖ సరుకు రవాణా కోసం ఏటా దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేస్తున్నట్టు సమాచారం. రేషన్‌ దుకాణాలకు, సంక్షేమ హాస్టళ్లకు బియ్యాన్ని సరఫరాచేసేందుకు 600 నుంచి 700 లారీలను ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఎరువులు, విత్తనాల సరఫరా కోసం వ్యవసాయశాఖ కూడా పెద్ద మొత్తంలో రవాణాఖర్చులు చెల్లిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు గుర్తించారు. విద్య, వైద్యం, బేవరేజస్‌ తదితర శాఖల్లోనూ రవాణా కోసం ఖర్చుచేయాల్సి వస్తున్నది. ఈ అవకాశాలన్నింటిని అందిపుచ్చుకొంటే ఆర్టీసీ ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు.ఇలా అన్ని శాఖ‌ల సహకారాన్ని అందిపుచ్చుకొంటే.. ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సేవ‌లు ప్రారంభించ‌నున్నారు. 

 

కాగా, ఇటీవ‌లే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆర్టీసీపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. దీన్ని సీఎం కె. చంద్రశేఖర్ రావు తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలే తప్ప, దాంతో చౌకబారు ప్రచారం పొందడం తమ అభిమతం కాదని అధికారులకు సీఎం స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి పి. రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీ ఎండికి నోట్ పంపారు. కార్గో బస్సులపై ముఖ్యమంత్రి ఫోటో వేయరాదని స్పష్టంగా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: