ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం వచ్చేసింది. భారీ భద్రత మధ్య, ఈవీఎంలు తెరచుకోనున్నాయి. 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. యావత్తు దేశం దృష్టిని ఆకర్షించిన ఈ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు త‌ర్వాత ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో  తేలిపోనుంది. ఇక  పోలింగ్ తుది శాతం ఎంతన్న విషయం ఆలస్యంగా ప్రకటించడంతో ఫలితాలపై కొంత ఉత్కంఠ నెలకొనివున్నా, ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఖాయమని వెల్లడించిన నేపథ్యంలో, ఆప్ వర్గాలు విజయంపై నమ్మకంతో ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం తామే గెలుస్తామని ధీమా వ్యక్తంచేస్తోంది. 

 

రాసిపెట్టుకోండి ఢిల్లీలో గెలిచేది మేమే.. ఆ తర్వాత ఈవీఎంలను నిందించకండి అంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని నమ్మకంగా ఉన్న కేజ్రీవాల్, ఈ ఉదయం గుడికి వెళ్లి వచ్చి, తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఎన్నికల ఫలితాల గురించి వేచి చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రధాన నేతలంతా తమ పిల్లలు, సతీమణులతో కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఫలితాలు వెల్లడికాగానే, దీపావళి పండగను మరోసారి జరుపుకునేందుకు వారంతా సిద్ధమవుతున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే పలు జాతీయ వార్తా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేశాయి. 

 

అందులో మెజారిటీ సర్వేలు ఆప్‌కే జై కొట్టాయి. కేజ్రీవాల్‌కు హ్యాట్రిక్ కట్టబెట్టాయి. మ‌రి అంద‌రూ ఊహించిన‌ట్టు ఈ ఉదయం 10 గంటల కెల్లా మరోసారి ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాల్ అధిరోహిస్తారా? లేదా? అన్న విషయం తేలుపోనుంది. అలాగే మ‌రోవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తన ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేయగా, బీజేపీ నేత విజయ్ గోయల్, కన్నాట్ ప్లేస్ లో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. కాగా, ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: