ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల ప్రకారమే, మెజారిటీకి చేరువవుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఇప్పటివరకూ 63 నియోజకవర్గాల ట్రెండ్స్ బయటకు వచ్చాయి. ఆప్ 48 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 14 స్థానాల్లో, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. 36 సీట్లలో గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండగా, ఇప్పటికే ఆప్ ఆ సంఖ్యను దాటేసింది. 

 

ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ’ విజయం సాధిస్తే ఆ పార్టీ హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ల‌వ‌ర్స్ డే ఫిబ్ర‌వ‌రి 14న సీఎం పీఠాన్ని అధిరోహిస్తారు. అయితే కేజ్రీవాల్ లైఫ్‌లో ల‌వ‌ర్స్ డే చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే.. 2013లో ఢిల్లీలో డిసెంబరు 4న అసెంబ్లీ ఎన్నికలు జరగగా, డిసెంబరు 8న ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ 31,  ఆప్  28, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ‘ఆప్’ కాంగ్రెస్‌తో జతక‌ట్టి డిసెంబరు 28న కేజ్రీవాల్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కాని, ఆప్, కాంగ్రెస్ మధ్య విబేధాలు తలెత్తడంతో జ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 

 

ఇందుకోసం ఆయన ఫిబ్రవరి 14ను ఎన్నుకుని రాజీనామా చేశారు. ఇక 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయాని కొస్తే, ఫిబ్రవరి 7న ఎన్నికల జరగగా, 10న ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 14న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా 2018లో ‘ఆప్‘ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, ఫిబ్రవరి 14న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘ద్వేషానికి ద్వేషమే సమాధానం కాదు. ద్వేషానికి కేవలం ప్రేమతోనే సమాధానం చెప్పగలమని’ అరవింద్ కేజ్రీవాల్ తన ప్రేమ సందేశాన్ని గతంలో వ్యక్తం చేశారు. ఇక మ‌రి ఆ సారి కూడా కేజ్రీవాల్ గెలిస్తే.. మ‌ళ్లీ ప్రేమికుల రోజు అయిన ఫిబ్ర‌వ‌రి 14న ప్ర‌మాణ‌స్వీకారం చేసి రికార్డు సృష్టించ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: