రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదంటారు. ప్రజల నాడి పట్టడం కష్టమంటారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తామని నిరూపిస్తున్నారు ఓ ముగ్గురు నాయకులు. ఒకాయన రాజకీయాలను శాసిస్తుంటే.. ఇంకొకాయన రాజకీయాలను ఔపాసన పట్టి ఏలేస్తున్నాడు.. మరొకాయన ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లో చక్రం తిప్పేస్తున్నాడు. వాళ్లే తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, ఢిల్లీ నుంచి కేజ్రీవాల్. ముగ్గురూ తమ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చిరస్మరణీయమైన విజయాలు సాధించి చరిత్రలో నిలుస్తున్నారు.

 

 

2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధించిన విజయం గొప్పది. 2014లో ప్రజల్లో గెలిచి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి ముందస్తుకు వెళ్లి తిరిగి అధికార పీఠం దక్కించుకున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, సీఎంగా ఆయన తెలంగాణ ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాల మధ్య వైసీపీని స్థాపించి దాదాపు పదేళ్లు ఒంటరి పోరాటం చేశారు జగన్. 2014లో తృటిలో ఓటమి పాలైనా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లారు. 2018 మొత్తం పాదయాత్రతో ప్రజల మధ్యే ఉండి 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం పీఠం అధిష్టించడం ఓ చరిత్ర.

 

 

ప్రస్తుత 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ సృష్టిస్తున్న విజయఢంకా మరో చరిత్ర. అవినీతిపై ఉద్యమం నుంచి పుట్టిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లి సీఎం అయ్యారు. పరిస్థితుల నేపథ్యంలో రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్తే.. కేజ్రీ మరింత మెజారిటీతో గెలిపించారు  ఢిల్లీ వాసులు. నేటి అసెంబ్లీ ఫలితాల్లో కూడా కాంగ్రెస్, బీజేపీలను ఊడ్చేస్తూ ఆయన సాధిస్తున్న విజయం నభూతో నభవిష్యతి. వరుసగా మూడేళ్లలో మూడు రాష్ట్రాల్లో ముగ్గురు నాయకులు సాధించిన ఈ విజయాలు చిరస్మరణీయ విజయాలే అని చెప్పాలి.

.

మరింత సమాచారం తెలుసుకోండి: