కేంద్రంలో బంపర్ మెజారిటితో చక్రం తిప్పుతున్న నరేంద్రమోడికి మరిన్ని ఎదురు దెబ్బలు తగలాలని ఏపి జనాలు కోరుకుంటున్నట్లే ఉన్నారు. తాజగా వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడి పరువు పోయిన విషయం అర్ధమైపోయింది. 70 స్ధానాలున్న అసెంబ్లీలో కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ 58 సీట్లలో మంచి మెజారిటీలతో దూసుకుపోతోంది. బిజెపి మాత్రం 12 స్ధానాల్లో మెజారిటితో అవస్తలు పడుతోంది.

 

నిజానికి ఢిల్లీలో గెలుపును మోడి అత్యంత ప్రతిష్టగా తీసుకున్నారు. అయితే జనాలు మాత్రం ప్రధానికి తలబొప్పి కొట్టేట్లుగా తీర్పు చెప్పారు. ఇక్కడే మోడి తీరుపై ఏపి జనాల్లో కూడా ఒకరకమైన సంతోషం కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ఏపి జనాలకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఎందుకింత సంతోషంగా ఉన్నారు ? ఎందుకంటే ఏపికి మోడి చేసిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకునే ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమికి ఆనందిస్తున్నారు.

 

మొదటిసారి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి మోడి ఏపి ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కేశారు. విభజన పాపంలో బిజెపికి కూడా స్వయంగా భాగస్వామ్యమున్న విషయాన్ని మోడి మరచిపోయినట్లు నటిస్తున్నారు. పోని విభజన హామల సంగతి పక్కనపెట్టినా ఎన్నికల ప్రచారంలో  స్వయంగా తానే ఇచ్చిన హామీలను కూడా పట్టించుకోలేదు. దాంతో ఏపిని మోడి ఎంతగా దెబ్బ కొడుతున్నారో జనాలకు బాగా అర్ధమైంది.

 

మరి ఏపి ప్రయోజనాలు నెరవేరాలంటే మార్గమేంటి ? ఏమిటంటే కేంద్రంలోని ప్రభుత్వం బలహీనపడటమే. ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం లేకుండా పార్లమెంటులో చక్రంతిప్ప గలిగినంత కాలం మోడి ఏపిని పట్టించుకోరన్నది వాస్తవం. అందుకనే ఇపుడు ఢిల్లీలో తగిలిన ఎదురుదెబ్బ లాంటిదే ముందుముందు కూడా కంటిన్యు అయితేనే ప్రాంతీయ పార్టీల మద్దతు గురించి మోడి ఆలోచిస్తారు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం అవుతుందో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. అందుకనే మోడికి భవిష్యత్తులు మరిన్ని ఎదురుదెబ్బలు తగలాలని ఏపి జనాలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: