ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లు అంశాన్ని ప్రస్తావిస్తూ పనిలో పనిగా వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ ముద్రగడ జగన్ కు లేఖ రాయడం పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ లేఖలో కాపు రిజర్వేషన్ అంశం గురించి తక్కువగా ప్రస్తావిస్తూ ...తన వ్యక్తిగత ఇబ్బందులను, వైసీపీ కి తాను చేసిన మేలును ఎక్కువగా హైలెట్ చేస్తూ ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖ ద్వారా జగన్ ప్రభుత్వం నుంచి ఏదో ఆశిస్తున్నట్టు గా అర్థం అవుతోంది. గతంలోనూ ముద్రగడ జగన్ ను ఉద్దేశించి అనేక లేఖలు రాసినా  ఈరోజు రాసిన లేఖ పూర్తిగా దానికి భిన్నంగా ఉంది.

 

కాపు రిజర్వేషన్ అంశం గురించి ప్రస్తావిస్తూ మీరు రిజర్వేషన్ల గురించి ఏమి హామీ ఇవ్వలేదని తెలిసినా  తాను ఈ లేఖ రాయడం తప్పడం లేదని అన్నారు. గత ప్రభుత్వం కాపులను బీసీల్లో చేరుస్తూ పంపించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని, దీనికి సంబంధించి మీరు ప్రధానమంత్రి మోదీ కి లేఖ రాయాలంటూ జగన్ ను ముద్రగడ కోరారు. ఈ సందర్భంగా ముద్రగడ వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించారు. గత టీడీపీ ప్రభుత్వంలో తాను ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని, ఎన్నో వేధింపులకు, అవమానాలకు ఆ ప్రభుత్వం గురిచేసిందని, ప్రస్తుతం పిల్లలకు ఇచ్చేందుకు కూడా నా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవని ప్రస్తావించారు. 


అక్కడితో ఆగకుండా జగన్ కోసం తాను ఎంత శ్రమ పడ్డానో వివరించారు. ఈ సందర్భంగా జగన్ కు సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ తనను బహిష్కరించింది అయినా వెనక్కి తగ్గకుండా సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేశానని ముద్రగడ చెప్పుకున్నారు. అలాగే పాదయాత్ర సందర్భంగా రాజమండ్రి బ్రిడ్జి పై భారీ ఎత్తున జనసమీకరణ చేశానని... కావాలంటే ఈ విషయాన్ని మీ పార్టీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి లను అడిగి తెలుసుకోవాలని గుర్తు చేశారు. 


కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఓదార్పుయాత్రను ఎంతో కష్టపడి 22 రోజుల పాటు చేశానని, అప్పటి పరిణామాలను ముద్రగడ గుర్తు చేశారు. మీ నుంచి ఒక్క రూపాయి గాని, ఒక వాహనం గాని ఎప్పుడూ ఆశించి లేదని, ఎవరికి వారు నా అభిమానులు సొంత ఖర్చులతో వచ్చారంటూ ముద్రగడ చెప్పుకున్నారు. ముద్రగడ లేఖ ద్వారా వ్యక్తం చేసిన తీరును చూస్తుంటే ఆయన కాపు రిజర్వేషన్ అంశం కంటే తాను వ్యక్తిగతంగా చాలా నష్టపోయాను అని, గతంలో తాను చేసిన మేలును మీరు గుర్తుంచుకుని తనకు ఏదో ఒకటి చేయాలి అన్నట్లుగా ముద్రగడ లేఖను చూస్తే అర్థం అవుతోంది. అయితే ఈ విషయం గురించి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఈ లేఖపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: