దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 58 స్థానాలలో ఆధిక్యంతో దూసుకుపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కేవలం 12 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. కానీ ఎన్నికల్లో ఘోర పరాజయం దిశగా పయనిస్తోన్న బీజేపీ పార్టీ మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో కుంటిసాకులు చెబుతూ ఉండటం గమనార్హం. 

 

ఎగ్జిట్ పోల్ అంచనాల తరువాత కూడా బీజేపీ ఢిల్లీలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పవుతాయని బీజేపీ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నాయకులు ప్రగల్భాలు పలికారు. కానీ ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో గతంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు మాత్రమే గెలిచాయని అది మా స్టేట్ కాదని అక్కడ మేం పాలించడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

బీజేపీ 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో 7 స్థానాలకు 7 స్థానాలు కైవసం చేసుకొని ఢిల్లీలో అసెంబ్లీ స్థానాల్లో కూడా తామే విజయం సాధిస్తామని లోక్ సభ ఎన్నికల ఫలితాలే అందుకు సాక్ష్యమని బీజేపీ నేతలు గతంలో చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. 7 లోక్ సభ స్థానాలు ఉంటే 7 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు 70 అసెంబ్లీ స్థానాలు ఉంటే 70 అసెంబ్లీ స్థానాలలో కూడా విజయం సాధించాలి కదా... ! ఎన్నికల్లో గెలిచిన సమయంలో ఒకలా ఓడిపోతే మరోలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం మెరుగైన ఫలితాలే సాధిస్తున్నా కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ స్థాయికి తగిన ఫలితాలు మాత్రం కాదనే చెప్పాలి. ఎన్నికల్లో ఓటమిపాలయినా బీజేపీ పార్టీ నేతలు ఓటమిని అంగీకరించకపోగా ఢిల్లీ మేము పాలించే ప్రాంతం కాదని వ్యాఖ్యలు చేస్తూ ఉండటం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందని నెటిజన్లు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: