వైసిపి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతూనే వస్తున్నాయి. అయినా జగన్ మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్టుగానే అమలు చేస్తున్నారు. టిడిపి పైన ఆ పార్టీ నాయకుల పైన తీవ్ర ఆగ్రహంతో ఉంటూ వస్తున్న జగన్ ఆ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం మరోసారి ఏపీ లో సంచలనం సృష్టించే విధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకుని జగన్ మాజీ నాయకులందరికీ భద్రతను పూర్తి స్థాయిలో ఎత్తివేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.


ఈ మేరకు ఏపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం భద్రతను తొలిగించేందుకు సిద్ధం అవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల భద్రత విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు మరోసారి మాజీలకు భద్రతను తీసివేస్తూ ప్రభుత్వం ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటే అది  వివాదాస్పదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అనేకమంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటమి చెందారు. అయినా వారికి ఇప్పటికీ భద్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో విపక్ష పార్టీలు గా ఉన్న టిడిపి, కాంగ్రెస్ నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.


టిడిపి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తో పాటు మరికొందరు టిడిపి నేతలకు ఇప్పటికే జగన్ ప్రభుత్వం భద్రత తొలగించింది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు,యరపతినేని   శ్రీనివాసరావు తదితరులకు భద్రతను తొలగించారు . దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేయగా స్టేట్ సెక్రటరీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే తాము భద్రతను తొలగించి నట్టుగా  పోలీసులు చెబుతున్నారు. అయితే టిడిపి నాయకులు మాత్రం ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తమ ప్రాణాలకు హాని ఉందని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం భద్రతను తీసివేయడం తమపై కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం అంటూ టీడీపీ మండిపడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: