ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద గుణపాఠం గానే చెప్పుకోవాలి. జాతీయ పార్టీగా... కేంద్ర అధికార పార్టీ గా తన హవా చూపిస్తూ వస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీల విషయంలో చాలా చిన్నచూపు చూస్తోందని విమర్శలు ప్రధానంగా ఎదుర్కుంటూ వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నిస్తూనే ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొదట్లో పొత్తు పేరుతో ప్రాంతీయ పార్టీలకు సన్నిహితంగా మెలిగినా తెరవెనుక మాత్రం బిజెపి ప్రాంతీయ పార్టీలను ఎదగకుండా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందన్న విషయం చాలా సందర్భాల్లో బయటపడింది. 


దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ నాయకులు సైతం ప్రాంతీయ పార్టీలపై కక్షసాధింపు ధోరణి తో వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయింపులోనూ పక్షపాత ధోరణి చూపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో బిజెపి బలపడి అధికారం చేపట్టేందుకు వీలుగా ప్రాంతీయ పార్టీలను, ఆ పార్టీలో కీలక నాయకులను బీజేపీ ఇబ్బందులు పెడుతూ వస్తుందనే అపవాదును బీజేపీ మీద వేసుకుంది. ప్రాంతీయ పార్టీల హవా దేశంలో పెరిగితే అది తమ పార్టీ ఉనికికే ప్రమాదం అని ముందే గ్రహించిన బిజెపి ఈ విధంగా వ్యవహరిస్తూ అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది.


 ఇప్పుడు ఢిల్లీలోనూ అదేవిధంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలోని క్రేజీవాల్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. పారదర్శకత పాలనను అందిస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల మనసును గెలుచుకుంటూ వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి జెండా ఎగరకపోతే తమ పరువు దేశవ్యాప్తంగా పోతుంది అనే భయంతో బీజేపీ ఎన్నికల్లో గెలుపు కోసం భారీ ప్రణాళికలు రచించింది. దేశవ్యాప్తంగా ఉన్న  బిజెపి అగ్రనాయకులు, సెలెబ్రెటీలను ఢిల్లీ ఎన్నికల్లో రంగంలోకి దించింది. 


అలాగే సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కీలకమైన వ్యక్తులను బీజేపీలో చేర్చుకుని ప్రచారానికి దింపింది. ప్రజలు మాత్రం క్రేజీవాల్ వైపే మొగ్గు చూపించారు. ప్రాంతీయ పార్టీల హవా ముందు బిజెపి నిలబడలేక పోతుంది అనే మాటలు ఢిల్లీ ఫలితాల తరవాత వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలు తమ పార్టీ ఉనికికే ప్రమాదం అని బిజెపి అగ్రనాయకులు ఆందోళన చెందుతున్నట్లు గా కనిపిస్తోంది. సామాన్యుడి పార్టీ గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయం బిజెపికి ఒక గుణపాఠం గానే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: