పై ఫోటోలో కనిపిస్తున్న వివాహిత పేరు కుసుమలత(27). ఆరేళ్ల కిందట ఈమె పెందుర్తి సమీపం పులగాలిపాలేనికి చెందిన కరక అప్పారావును పెళ్లి చేసుకుంది. వీరి 6ఏళ్ళ వివాహ బంధంలో ఇద్దరు బాలికలు జన్మించారు. విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వే విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అప్పారావు కుసుమలతను బాగానే చూసుకునేవాడు. అయితే అప్పారావుతో పాటే అతడి తల్లిదండ్రులైన నూకాలు, అప్పలకొండ నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డబ్బులు అవసరం పడటంతో వీళ్లిద్దరూ కలిసి కుసుమలత బంగారు నగలను తాకట్టు పెట్టారు. ఇది తెలుసుకున్న కుసుమలత తన అత్త మామ పై అలిగింది.


ఫిబ్రవరి 6వ తారీకున మధ్యాహ్నం 2:30 నిమిషాలకు తన 18 నెలల చిన్న కుమార్తె జ్ఞానసకి మూత్రము పోయిస్తానని చెప్పి కుసుమలత ఇంటి బయటకు వెళ్లింది. అయితే ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో.. కంగారు పడిపోయిన భర్త బయటికి వచ్చి వెతకగా ఆమె ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో ఆయన తన బావమరిదికి ఈ విషయం చెప్పిగా 7తేదీన బావమరిది పోలీస్ స్టేషన్ కి వెళ్లి కుసుమలత తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతకసాగారు.


మరోవైపు పాపతో పాటు బయటికి పారిపోయి వచ్చిన కుసుమలత ఎక్కడికి వెళ్లాలో తెలియక అనేక ప్రాంతాల్లో నాలుగు రోజుల వరకు తిరిగింది. చివరికి చినముషిడివాడలోని వుడా కాలనీ కొండలమీదకి చేరుకుంది. మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుసుమలత సెల్ ఫోన్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె చినముషిడివాడలోని వుడా కాలనీ కొండలపై ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా ఆమె ఒక్కటే కనిపించింది కానీ జ్ఞానస మాత్రం కనిపించలేదు. దీంతో పాప ఎక్కడ అని పోలీసులు ప్రశ్నించగా... పాలు లేక తన కుమార్తె ఆకలితో చనిపోయిందని, మృతదేహాన్ని ఆ కొండపైనే పూడ్చి పెట్టానని ఆమె బదులిచ్చింది. ఇది విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.


తరువాత తేరుకొని.. బాలిక మృతదేహం కోసం కొండపైన వెతకగా.. ఎక్కడా ఆ చిన్నారి భౌతికకాయం లభించలేదు. దీంతో కుసుమలతని మళ్లీ అడగగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దాంతో ప్రస్తుతం ఆమెని విచారిస్తుడటంతో పాటు గత నాలుగు రోజుల పాటు ఆమె ఏయే ప్రాంతాల్లో తిరిగిందో పోలీసులు తెలుసుకుంటున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: