ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించినా బిజెపి ఇప్పుడు ఆ వైఖరిని మార్చుకుని ఏపీ సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రెండుసార్లు బిజెపి అగ్రనేతలు కలిసేందుకు జగన్ ప్రయత్నాలు చేసినా ...వారి అపాయింట్మెంట్ దక్కలేదు. దీంతో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసిన జగన్ నిరాశతో వెనుదిరిగారు. దీనిపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఎద్దేవా చేసింది.

 

ఈ పరిణామాలతో బిజెపి వైసీపీల మధ్య రాజకీయ వైరం ముదరబోతోందని, ఏపీలో జగన్ ను అణిచివేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని అంతా భావించారు కానీ అదంతా అవాస్తవమని, జగన్ తీసుకునే ప్రజా ప్రయోజనకరమైన నిర్ణయాలకు తాము మద్దతు ఇస్తామని కేంద్రం కొద్దిరోజులుగా ప్రకటిస్తూనే... దానికి అనుగుణంగా ముందుకు వెళ్తోంది. 

 

 ఈ నేపథ్యంలో బుధవారం జగన్ ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షాలను జగన్ కలవబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు వారి అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా జగన్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రానికి అవసరమైన నిధులు, శాసనమండలి రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో సీఐడీ, ఈడీ, ఐటీ శాఖలు టీడీపీ నాయకులకు సంబంధించి వెలికి తీస్తున్న ఆధారాలు, మూడు రాజధానులు తదితర విషయాలపై చర్చించి తగిన సలహాలను, సూచనలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


 ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో ఇప్పటికే కేంద్రం తమకు మద్దతు తెలిపినా  ఈ విషయం లో మరికొన్ని సూచనలతో పాటు కొత్తగా తాను అమలు చేయాలనుకుంటున్న పథకాలు, నిర్ణయాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి వ్యవహారాలు, వారు చేస్తున్న విమర్శలు వంటి విషయాల పైన ప్రధానంగా జగన్ చర్చించే అవకాశం కనిపిస్తోంది.


 రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయలని జగన్ కోరే అవకాశం ఉన్నట్ట్టు సమాచారం. జగన్ ఢిల్లీ పర్యటన పూర్తయిన తర్వాత వైసిపి ప్రభుత్వానికి అన్ని విషయాలలోనూ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాని అనుగుణంగా ఏపీలో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు జగన్ చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: