తెలుగుదేశం పార్టీలో మాజీ ఇంటెలిజెన్స్ బాస్ ఏబీ వెంకటేశ్వర వ్యవహారం ఇంకా అగ్గి రాజేస్తూనే ఉంది. ఇప్పటికే దీనిపై రెండుగా చీలిన తెలుగుదేశం నాయకులు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏబీ వెంకటేశ్వర రావు చేసిన వ్యవహారాల గురించి ఒక్కొక్కటిగా ఆ పార్టీ నాయకులే బయట పెడుతున్నారు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అధికారిగా పేరుపొందిన ఏబీ వెంకటేశ్వరరావు పై ఒక వర్గం టిడిపి నాయకులు ఆగ్రహం చెందడానికి వెనుక కారణాలు చాలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. 


ప్రస్తుతం ఆయన ఏపీలో నిఘా పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలకు పలాడడమే కాకుండా, దేశ రహస్యాలకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా ఇజ్రాయిల్ కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అందించారనే ఆరోపణలతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ సస్పెన్షన్ పై ప్రకటన వెలువడగానే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఏబీ వెంకటేశ్వరరావు ను అనవసరంగా సస్పెండ్ చేశారని, సన్మానం చేస్తారని మేము అంతా భావించాము అంటూ వ్యంగ్యంగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అయితే ఆయన ఆకతాయితనం గా అయితే ఈ ట్విట్  పెట్టలేదని, దీని వెనుక కారణాలు చాలానే ఉన్నట్లుగా తెలుస్తోంది. 


చంద్రబాబు ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసినా టిడిపి అంటే ఎక్కడలేని ఆసక్తి కనబరిచేవారని, చంద్రబాబు కు సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించారని విషయం తెలుస్తోంది. గతంలో ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ గా కూడా పని చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటిలిజెన్సు చీఫ్ గా  బాధ్యతలు చేపట్టి చంద్రబాబుకు మరింత దగ్గరయ్యారు. ఇక అప్పటి నుంచి పార్టీలో నాయకులపై పెత్తనం చేస్తూ ... తనకు నచ్చిన వారిపై వ్యతిరేకంగా ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇస్తూ వివాదాస్పదం అయ్యారు. దీనిపై అప్పట్లోనే ఏబీ వెంకటేశ్వరరావు బాధితులైన కొంతమంది టిడిపి నాయకులు, ఎమ్యెల్యేలు, మంత్రులు ఆగ్రహంగా ఉంటూ వచ్చారు. 


కానీ చంద్రబాబు మద్దతు ఆయనకు పూర్తి స్థాయిలో ఉండడంతో వారు నోరు మెదపకుండా సైలెంట్ అయిపోయారు. ఇక టిడిపి ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో నిఘా పరికరాలు కొనుగోలు చేశారని, ఈ వ్యవహారంలో అనేక తప్పిదాలకు పాల్పడ్డారనే విషయం ఇప్పుడు బయటపడినా వాటిని వైసిపి, టిడిపి లోని కొంత మంది ఎమ్మెల్యేలపై నిఘా పెట్టేందుకు వాడుకున్నారనే  విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే ఏబీ వెంకటేశ్వరరావు పేరు చెబితే టీడీపీలోని ఒక వర్గం నాయకులు మండిపడడానికి కారణంగా తెలుస్తోంది. 


అసలు ఇంటలిజెన్స్ చీఫ్ గా రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను చెప్పాల్సింది పోయి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి అన్ని చోట్ల బావుంది అన్నట్లుగా ఆయన నిఘా నివేదికలు ఇవ్వడంతోనే చంద్రబాబు వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా.... గెలుపు ధీమాతో ముందుకు వెళ్లారని అదే టీడీపీకి ఈ దుస్థితి పట్టడానికి కారణం అని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. నిఘా పరికరాలను కేవలం కొన్ని పార్టీల కోసం, వినియోగించి టీడీపీకి మేలు చేసేందుకు ప్రయత్నించారని విషయం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింతగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: