ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో సెంట‌ర్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్ గా మారిపోయారు. అస‌లు ఆప్ పార్టీ పెట్ట‌డ‌మే ఓ సంచ‌ల‌నం.. అప్ప‌టి నుంచి కేజ్రీవాల్ ఈ కుళ్లు రాజ‌కీయాల‌ను త‌న చీపురుతో ఊడ్చేస్తాన‌ని చెప్పారు. ఆయ‌న చెప్పింది చెప్పిన‌ట్టు గానే ముందుగా ఢిల్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం.. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీ రాక‌పోయినా కాంగ్రెస్‌తో క‌లిసి సీఎం అవ్వ‌డం.. ఆ వెంట‌నే 2015లో పూర్తి మెజార్టీతో అది కూడా ఏకంగా 70కు 67 సీట్లు సాధించి ఢిల్లీ ముఖ్య‌మంత్రి అవ్వ‌డం జ‌రిగాయి.

 

ఐదేళ్ల పాటు కేజ్రీవాల్‌ను ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అయితే కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయి. సీఎంగా ఉన్నా కేజ్రీవాల్ సామ‌న్యుడిగా ప్ర‌జ‌ల్లో క‌లిసి పోవ‌డం.. సామాన్యుడి బాధ‌లు తెలుసుకోవ‌డం లాంటి అంశాల‌ను ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నాయి. అందుకే తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు ఏకంగా 63 సీట్ల‌తో వ‌రుస‌గా రెండోసారి ఘ‌న‌విజ‌యం క‌ట్ట‌బెట్టారు.

 

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ సాధించిన ఘ‌న‌విజ‌యంతో ఇప్పుడు ఆయ‌న 2024లో ఢిల్లీ పీఠం ఎక్కుతార‌ని.. మోడీని ఢిల్లీ పీఠం నుంచి కూడా గ‌ద్దె దింపుతార‌ని ఆ పార్టీ వాళ్లు పోస్ట‌ర్లు వేసి సంబ‌రాలు చేసుకుంటున్నారు. అంతెందుకు 1996లో హెచ్ డి. దేవ‌గౌడ ఎలా ప్ర‌ధాన మంత్రి అయ్యార‌ని.. అలాగే 1998లో ఐకె. గుజ్రాల్ సైతం ప్ర‌ధాన మంత్రి అయ్యార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం పాత మైసూరు ప్రాంతానికి ప‌రిమితం అయ్యే జేడీఎస్ నుంచి గెలిచిన ల‌క్ క‌లిసొచ్చి ప్ర‌ధాన మంత్రి అయ్యార‌ని వారు గుర్తు చేస్తున్నారు.

 

రేప‌టి వేళ కాలం క‌లిసొచ్చి థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్ప‌డితే కేజ్రీవాల్ సైతం ప్ర‌ధాన మంత్రి అవుతార‌ని ఆప్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఆప్ ధీమా ఎలా ఉన్నా ఢిల్లీలో కేవ‌లం 7 ఎంపీ సీట్లే ఉన్నాయి. మ‌రి మ‌హారాష్ట్ర‌, బెంగాల్ లాంటి చోట్ల 45కు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్లు కేజ్రీవాల్‌కు ఎంత స‌పోర్ట్ చేస్తార‌న్న‌ది కూడా సందేహ‌మే. ఏదేమైనా రాష్ట్రాల్లో సీఎంలు మెజార్టీ మోడీకి వ్య‌తిరేక‌మ‌వుతోన్న వేళ భ‌విష్య‌త్తులో ఎలాంటి ప‌రిణామాలు వ‌స్తాయో ?  ఎవ‌రూహించ‌గ‌ల‌రు..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: