జీవితం అంటే మనం ఊహించుకున్న పరిణామాలే కాకుండా ఊహించని పరిణామాలు కూడా ఎన్నో జరిగిపోతూ వుంటాయి. అప్పుడు మనం నిమిత్తమాత్రులుగానే చూస్తూ ఉండిపోవాలి. ఇక రాజకీయాల్లో అయితే ఊహించని ట్విస్ట్ లు, వెన్నుపోట్లు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇలా ఎన్నో ఉంటాయి. అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగితే రాజకీయ జీవితం సాఫీగా ముందుకు వెళుతుంది. ఇప్పుడు ఇటువంటి అన్ని పరిణామాలను ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు ఏపీలో అధికార పార్టీ గా టీడీపీ ఉన్న సమయంలో ఏపీ లోనే కాకుండా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు రాజకీయ పరిస్థితి తరుమరవ్వడంతో  దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.


 ముఖ్యంగా అమరావతి నుంచి రాజధాని విశాఖ కు తరలించడం అనే జగన్ నిర్ణయాన్ని బాబు తట్టుకోలేకపోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిగా అమరావతి ఉండాలంటూ పట్టు పడుతున్నాడు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా అడ్డుకుంటున్నాడో అంతే స్థాయిలో రాజధానిని విశాఖకు తరలించే విషయంలో జగన్ మంకుపట్టు పడుతున్నాడు. ఈ విషయంలో కేంద్రం మద్దతు కూడా ఆ పార్టీకి లభించడంతో ఇక ఇది ఎక్కడా బ్రేక్ పడే అవకాశం కనిపించడం లేదు. కానీ మూడు  రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబు ఆ ప్రాంత ప్రజలను, పార్టీ నాయకులను అప్రమత్తం చేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరూరు తిరుగుతూ జోలె పట్టుకుని నిధులు కూడా చంద్రబాబు పోగు చేశారు.

 

 అమరావతి ఉద్యమానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు మూడు రాజధానుల  ప్రతిపాదనను అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా తన పాత మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా రంగంలోకి దించి అమరావతి కి మద్దతుగా ప్రకటనలు చేయడంతో పాటు ఆందోళన చేశారు. 50 రోజుల తర్వాత అమరావతి ఉద్యమం ఆశించిన ఫలితం ఇవ్వకపోగా ఆ ఉద్యమం గురించి ఇప్పుడు అంతా పక్కకు తప్పుకుంటున్నారు. కేంద్రం ప్రకటనతో టిడిపి ఈ విషయంలో ఒంటరిగా మిగిలిపోయింది. అందుకే నాలుగు రోజులుగా రాజధానిపై నోరు మెదపలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉండిపోయారు.


 పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా వుంటే తమతో కలిసి వచ్చే వాడిని, ఇప్పుడు బీజేపీతో పొత్తు కారణంగా ఆయన తమకు దూరంగా ఉంటున్నాడనే బాధ కూడా చంద్రబాబుకు ఎక్కువైంది. మొన్నటి వరకు రాజధానికి మద్దతుగా టీడీపీకి సపోర్ట్ గా మాట్లాడిన బిజెపి నేతలు ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో సైలెంట్ అయిపోయారు. అమరావతి వ్యవహారం ద్వారా ఏపీలో టీడీపీకి పునర్వైభవం తీసుకొద్దామని బాబు భావిస్తే ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యిందనే బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: