ఢిల్లీ  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి  పాతకథే పునరావృత్తమైంది . అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి . కానీ ఇప్పుడు కూడా అదే ఫలితం పునరావృత్తం కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు . ఐదేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ చిత్తయిందంటే దానికొక లెక్క ఉంది . అప్పటి వరకు  రాష్ట్రంలో ఏకంగా 15  ఏళ్లపాటు అధికారం లో ఉన్న కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత వల్ల, ఆ పార్టీ ఒక్క స్థానం లో కూడా గెలువలేదని సరిపెట్టుకున్నారు .

 

కానీ ఐదేళ్లు గడిచిన  తరువాత  జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ కి ఒక్క స్థానం కూడా దక్కకపోవడంతో , ఏమి సమాధానం చెప్పాలో ఆ పార్టీ నేతలకు పాలుపోని పరిస్థితి నెలకొంది . ఢిల్లీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కాగా , బీజేపీ కాసింత పుంజుకున్నట్లు కన్పిస్తోంది . గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకే పరిమితమైన బీజేపీ, ఇప్పుడు ఎనిమిది స్థానాలు గెల్చుకుని కాసింత ఫర్వాలేదనిపించుకుంది . ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ కి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ నేతలు పరోక్షంగా తమ విజయంగా సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు .  అయితే ఒక పార్టీ ఎన్నికల్లో సొంతంగా విజయం సాధించలేక , ఇతర పార్టీపై ఆధారపడడం అంటే దానికంటే ఆత్మహత్య సదృశ్యమే తప్పా  ... మరొకటి కాదని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు  .

 

ప్రత్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక, ఇతర పార్టీ గెలిస్తే తాము సంబరాలు చేసుకోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది . ఏదిఏమైన ఐదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడకపోవడం చూస్తుంటే , ఢిల్లీ లో ఇక ఇప్పట్లో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి .  

మరింత సమాచారం తెలుసుకోండి: