వందేళ్ల ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కి మునుపెన్నడూ లేని విధంగా అతి ఘోరమైన చెత్త ఫలితాలు ఢిల్లీలో నమోదయ్యాయి. ఢిల్లీని సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేక చతికిలబడి పోయింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముందు నుంచి అందరూ ఊహించినట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసుకుని మూడోసారి అధికారాన్ని చేపట్టింది. సామాన్యుడి పార్టీ గా గుర్తింపు పొందిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మొత్తం 70 స్థానాలలో 62 స్థానాలను గెలుచుకుని ఢిల్లీ పీఠంపై తన జెండా మరోసారి రెపరెపలాడించింది. 


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఢిల్లీ పీఠం తమకే దక్కుతుందని ముందు నుంచి భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోవడం ఆ పార్టీ అగ్ర నాయకులతో సహా అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం మాత్రమే ఓట్లు నమోదు అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కు ఎదురుగాలి ఏ రేంజ్ లో ఉందో అర్ధం అయిపోతుంది.

 

 ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున మొత్తం 66 మంది అభ్యర్థులు పోటీ చేయగా వారిలో 63 మందికి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం ముగ్గురు మాత్రమే డిపాజిట్లు దక్కించుకుని ఆ పార్టీ పరువు కొంతవరకు కాపాడగలిగారు. అర్విందర్ సింగ్ లవ్లీ (గాంధీ నగర్), దేవేందర్ యాదవ్ (బద్లి), అభిషేక్ దత్ (కస్తూర్బా నగర్)కు మాత్రమే డిపాజిట్లు దక్కడం కొంతలో కొంత కాంగ్రెస్ కు ఊరటనించే అంశంగా కనిపిస్తోంది. 


గతంలో ఢిల్లీ పీఠాన్ని మూడుసార్లు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఇప్పుడు ఈ విధంగా గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు రోజురోజుకు ఆదరణ తగ్గుతోంది అనే విషయాన్ని బయటపెట్టింది. భవిష్యత్తులో తాము కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న ఆశ కూడా కాంగ్రెస్ పెద్దల్లో అడుగంటి పోతోంది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ డైలమాలో పడినట్లు అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: