హైద‌రాబాద్ వాసుల‌కు మెరుగైన ర‌వాణా స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఉద్దేశించిన మెట్రో కొత్త పుంత‌లు తొక్కుతోంది. హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గించడంతోపాటు నగరాన్ని గ్లోబల్‌ సిటీగా మార్చేందుకు ఈ సేవ‌లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ రూటు ప్ర‌త్యేక‌త‌ను న‌మోదు చేసుకుంది. సోమవారం ఒక్కరోజే  33,886 మంది ప్రయాణించినట్లు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 

 

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే సుమారు గంట సమయం పడుతుంది. ఈ మెట్రో అందుబాటులోకి రావడంతో 11 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం కలిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. జేబీఎస్‌, పరేడ్‌ గ్రౌండ్‌, సికింద్రాబాద్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్‌ మీదుగా ఎంజీబీఎస్‌కు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి. ఈ మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన అనంత‌రం పెద్ద ఎత్తున జ‌నం మెట్రో సేవ‌లు వినియోగించుకున్నారు. 

 


 సోమవారం ఒక్కరోజే  33,886 మంది ప్రయాణించినట్లు తెలిపిన‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఇందులో ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచి అత్యధికంగా  14,894 మంది ప్రయాణం చేసినట్లు తెలిపారు.  నెల రోజుల్లో జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో మెట్రోరైలు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. మిగ‌తా కారిడార్ల గురించి వివ‌రిస్తూ.. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌కు సంబంధించి కారిడార్‌1లో 2,45,865 మంది, నాగోల్‌ నుంచి ఉప్పల్‌కు సంబంధించి కారిడార్‌3లో  2,45,825 మంది ప్రయాణించినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇలా మూడు మార్గాల్లో కలిపి 4.47లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. అధిక రద్దీ విషయంలో  అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ 25,779 మంది ప్రయాణీకులతో ముందు వరుసలో ఉండగా, ఎల్బీనగర్‌ 24,181,  , రాయదుర్గం 21,957,మియాపూర్‌ 19,425 , కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు స్టేషన్‌ 16,677,  హైటెక్‌సిటీ 13,568,జేఎన్టీయూ 13,513, ఉప్పల్‌ 13,913, సికింద్రాబాద్‌ 15,294, జేబీఎస్‌ 14,894 మంది ప్రయాణీకులు  ఇలా ప్రతీ స్టేషన్‌లో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: